వివేకా హత్య కేసుని సి‌బి‌ఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు….

Share Icons:

అమరావతి:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఈ హత్యకేసుపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. వైఎస్ వివేకా కుమార్తె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పిటీషన్‌పై వాదనలను విన్న తరువాత.. విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

కాగా, 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయి అని వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం రాజకీయంగా పెను సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్య వెనుక పలు రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సిట్ విచారణ వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జగన్ ప్రభుత్వం కూడా వైఎస్ వివేకా హత్య కేసును సిట్‌తోనే విచారించాలని నిర్ణయించింది. అయితే, వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు మాత్రం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉందని వైసీపీ ఆరోపించిన టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి కూడా ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సీబీఐ విచారణ అవసరం లేదని, సిట్ విచారణ చివరి దశకు వచ్చిందని జగన్ ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. కానీ, కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

 

Leave a Reply