ఇళ్ల స్థలాలుగా అమరావతి భూములు…ఏయే ప్రాంతాల వారికి ఇస్తారంటే?

Share Icons:

అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్రంలోని దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్క నిరుపేద ఇల్లు లేకుండా ఉండొద్దనేది తమ లక్ష్యమని సీఎం జగన్ గతంలో తెలిపారు. పేదలకు ఉచితంగా స్థలాలు ఇవ్వడంతోపాటు.. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి ఇల్లు కట్టిస్తామని మంత్రి బొత్స తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌ మెంట్‌ తరహా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. లేని చోట వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు.

ఈ క్రమంలోనే రాజధాని నిర్మాణం కోసం అమరాతి ప్రాంత రైతుల దగ్గర్నుంచి సమీకరించిన భూముల్లో కొద్ది మొత్తాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 1251 ఎకరాల్లో 54 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం కోసం ఈ భూములను కేటాయిస్తారు. ఇందులో అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం సమీకరించిన భూములు కూడా ఉండటం గమనార్హం.

సీఆర్డీఏ పరిధిలో, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో నివసించే అర్హులకు ఈ భూములను అందజేయనున్నారు. గుంటూరు జిల్లాలోని పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందినవారితో పాటు.. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని పేదలకూ అమరావతిలో స్థలాలను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 28,952 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. మిగతా గ్రామాల్లో 25,355 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ సొంతింటిని నిర్మించుకోవడానికి 1251 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది.

రాజధాని అమరావతి నగర పరిధిలో భూసమీకరణ కింద తీసుకున్న భూమిలో ఇప్పటికే 87.02 ఎకరాల్ని పేదలకు గృహ నిర్మాణం కోసం ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు. రాజధానిలోని నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల పరిధిలో 1251 ఎకరాల్ని ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్నారు.

 

Leave a Reply