రాజధాని రైతులని బుజ్జగించేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహం…

amaravati farmers protest
Share Icons:

అమరావతి: రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని గత 20 రోజులుగా ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్లెక్కి ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అమరావతి రైతులని బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళుతుంది. అందులో భాగంగానే వారిని బుజ్జగించే బాధ్యతలను మంత్రి కొడాలి నానికి అప్పగించినట్లు తెలుస్తోంది. వారిని ముందుగా చర్చలకు ఒప్పిస్తే..వారి డిమాండ్లు తెలుసుకొని వారిని మెప్పించే ప్రయత్నం చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇప్పటి వరకు వారి ఆందోళన వెనుక టీడీపీ ఉందని..రియల్టర్లు ఉన్నారని చెబుతూ వచ్చిన అధికార పార్టీ నేతలు..ఇంకా ఆందోళన కొనసాగు తుండటం, రాజకీయంగా ఇతర పార్టీలు వారికి మద్దతు పలుకుతుండటంతో వ్యూహం మార్చుకున్నారు. మూడు రాజధానుల పైన ప్రభుత్వం ముందుకే వెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఈ నెల 17 లేదా 18 తేదీల్లో నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే కేబినెట్..అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి..అధికారికంగా ముందుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో..అమరావతి ప్రాంతంలో ఇక ఆందోళనలు చేయకుండా..రైతులతో చర్చలు జరపాలని భావిస్తోంది.

ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని ప్రభుత్వం నుండి రైతులను చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. ఆయన తాజాగా.. అమరావతి రైతులు ప్రభుత్వంతో చర్చలకు వచ్చి వారి డిమాండ్లను వివరిస్తే న్యాయం చేయడానికి సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. రైతులు సరైన అవగాహన..డిమాండ్లతో చర్చలకు వస్తే న్యాయం చేయటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. మరో కీలక మంత్రి రైతులతో చర్చలు జరపలేమని..ఇప్పుడు సమయం కూడా కాదని చెప్పుకొచ్చారు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను ..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని కొడాలి నాని ద్వారా రైతులను చర్చలకు పిలిచే ప్రయత్నం ప్రభుత్వం మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం బుజ్జగింపులకు రైతులు తలొగ్గతారా? అనే అంశం మున్ముందు చూడాలి.

 

Leave a Reply