రాజధాని అమరావతిలో ట్విస్ట్: 5 గ్రామాలు ఎలిమినేట్…

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి: గత 50 రోజుల పై నుంచి అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. వీరు ఇలా ఉద్యమం చేస్తున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అమరావతి నుంచి ఐదు గ్రామాలను తొలగించి.. వాటిని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి పంచాయతీలను మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు ఇచ్చింది.

తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి రాజధాని పరిధిలోకి వస్తాయి. ఈ రెండు గ్రామాలతోపాటు ప్రాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, గుండిమెడ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలైన నవులూరు, బేతపూడి, ఎర్రబాలెంతో పాటు ఆత్మకూరు, చినకాకాని పంచాయతీలను మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జీవో జారీ చేశారు.

రాజధాని నగర పరిధిలోని 25 గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 3 పంచాయతీలను కలిపి అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగానే.. ప్రభుత్వం అమరావతి పరిధి నుంచి ఐదు గ్రామాలను తప్పించడం గమనార్హం. కానీ ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. తాడేపల్లి, మంగళగిరిలను మోడల్‌ మున్సిపాల్టీలుగా చేస్తామని జగన్ సర్కారు మొదటి నుంచి చెబుతోంది. ఇందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు అవసరమని ఇటీవలే సీఎం జగన్ తెలిపారు.

అటు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మెట్రోరైలు ప్రాజక్టు పరిధి పెంచాలన్న కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తీసుకున్నారు. గతంలో సిద్దమైన మెట్రో రైలు డీపీఆర్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీఆర్ రెడీ అయిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు. తాజాగా మరోసారి డీపీఆర్ రూపొందించేందుకు ప్రతిపాదనలను పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చారు. గతంలో సుమారు 38 కి.మీల మేరకు మాత్రమే విశాఖలో మెట్రో నిర్మించాలని అప్పటి ప్రభుత్వం తలపెట్టగా జగన్ ప్రభుత్వం దాన్ని 80 కి.మీ.లకు పెంచాలని తలపెట్టింది.

 

Leave a Reply