ఇంగ్లీష్ మీడియంతో పాటు…మండలానికి ఓ తెలుగు మీడియం స్కూల్‌?

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: ఇంగ్లీష్ మీడియం ప్రతిఒక్కరికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో..సీఎం జగన్ సర్కార్ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు చట్టం చేసి…అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించింది. ఏ మీడియంలో చదువుకోవాలనే వెసులుబాటు విద్యార్థులకే ఇవ్వాలని.. సవరణలు సూచిస్తూ బిల్లును మండలి తిప్పి పంపింది. మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ ఈ మేరకు సవరణ చేసింది. అయితే ప్రభుత్వం సవరణలు ఏం చేయకుండానే బిల్లుని అమలు చేయాలనీ జీవో కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. లింగ్విస్టిక్ మైనార్టీ స్కూళ్లలో ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ భాషల్లో బోధనను కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేసిందని తెలిసింది. దీంతో తెలుగు మినహా మిగతా భాషల్లో బోధనకు మార్గం సుగమమైంది. ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలోనే తమ పిల్లలను చదివించాలని కోరుకుంటున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎవరైనా తల్లిదండ్రులు తెలుగు మీడియం ఎడ్యుకేషన్‌ను కోరుకుంటే.. మండలానికి ఓ తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని న్యాయస్థానానికి తెలిపింది.

అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తున్నామని విజయవాడలోని జక్కంపూడి ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఆ కమిటీ ఎక్స్‌ అఫిషియో సభ్యురాలు బి.శ్వేతా భార్గవి హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి తమ వాదనలూ వినాలని కోరుతూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక మొత్తం మీద వాదనలని విన్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

 

Leave a Reply