అమరావతిపై జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి:  ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం రాజధాని ఇక్కడే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్లపై తలొగ్గకుండా రాజధాని విశాఖ తరలించాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపై ముందుకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం అమరావతి విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో స్థానిక సంస్థలు, పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమరావతిలో ఎన్నికలు నిర్వహించకూడదని ఏపీ ప్రభుత్వం చూస్తుంది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పంచాయితీ ఎన్నికలు లేకుండా.. పూర్తిగా మన్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా.. అమరావతి పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు నిర్వహించద్దంటూ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అక్కడి కొన్ని గ్రామాలను మంగళగిరి..తాడేపల్లి మన్సిపాల్టీల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మిగిలిన గ్రామాలను కలిపి అమరావతి కార్పోరేషన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సంఘం ఆమోదించగానే..వచ్చే కేబినెట్ సమావేశంలో అధికారిక ఆమోద ముద్ర వేయనున్నారు.

అమరావతి ప్రాంతం రాజధానిగా అయిదేళ్లకు పైగా ఉన్నా..ఇప్పటి వరకు మున్సిపల్ లేదా నగరపాలక సంస్థగా గుర్తింపు రాలేదు. ఇంకా గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే, ప్రభుత్వం నుండి తాజాగా ఎన్నికల సంఘానికి ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది లేఖ రాశారు. అందులో రాజధానిపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించాలని కోరారు.

యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి పురపాలికలో కలపాలని, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని ప్రతిపాదించారు. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం గా తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. అక్కడి నుండి అనుమతి రాగానే రానున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు.

 

Leave a Reply