మద్యపాన నిషేధం ఎఫెక్ట్: బంపర్ ఆఫర్లు ఇస్తున్న వ్యాపారులు

wine shops increase in telangana
Share Icons:

అమరావతి:

ఏపీ సీఎం జగన్ మద్యపాన నిషేధంగా వెళుతున్న విషయం తెలిసిందే. నవరత్నాల అమలులో భాగంగా దశల వారిగీ మద్యపాన నిషేధాన్ని చేయాలని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఇక నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలని నిర్వహించనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 500 షాపులు నిర్వహిస్తుంది. అలాగే అక్టోబర్1 నుంచి మిగతా 3వేల షాపులని నిర్వహించనుంది. ఇక ఈ 3,500 లని మాత్రమే ప్రభుత్వం నిర్వహించనుంది…మిగతావి మూతపడనున్నాయి.

అయితే ఇప్పటివరకు మద్యం షాపులని నిర్వహిస్తున్న వ్యాపారులు ఈ నెలలోనే షాపుల్లో ఉన్న మద్యాన్ని అమ్మేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. చివరి సీసా వరకూ వినియోగదారులకే అమ్మాలని నిర్ణయించుకున్నారు. మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌ శాఖకు తిరిగి అప్పగించినా.. వ్యాపారులకు ఎలాంటి నగదూ చెల్లించదు. అంటే 30 తర్వాత సరుకు మిగిలిపోతే వ్యాపారుల దృష్టిలో బూడిదలో పోసిన పన్నీరుగానే భావించాల్సి ఉంటుంది. దానివల్ల ఎక్సైజ్‌కు లాభం తప్ప వ్యాపారులకు పైసా తిరిగి రాదు.

ఈ నేపథ్యంలో గతంలోనే కొనుగోలు చేసి అమ్ముడుపోని బ్రాండ్లపై పలుచోట్ల వ్యాపారులు డిస్కౌంట్లు ఇస్తున్నారు. విజయవాడలోని ఓ షాపులో సుమారు రూ.2వేల ఖరీదు చేసే ఒక సీసాపై రూ.300కు పైగా డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దాంతోపాటు ఒకేసారి మూడు నాలుగు బాటిళ్లు కొంటే లెథర్‌ బ్యాగ్‌లు, టూరిస్ట్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు. గిఫ్ట్‌లు ఉత్పత్తిదారులు ఇస్తున్నారనుకున్నా, డిస్కౌంట్ల నష్టాన్ని మాత్రం వ్యాపారులే భరిస్తున్నారు.

విజయవాడతో పాటు మిగతా పట్టణాల్లో ఇలాంటి కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. పట్టణాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కనుక, అందుకు అనుగుణంగా గతంలో భారీగా సరుకు తీసుకున్నవారు ఇప్పుడు వాటిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే కొత్త మద్యం పాలసీలో లిక్కర్‌ బ్రాండ్లు పరిమితం కానున్నాయి. మే, జూన్‌, జూలై మాసాల అమ్మకాలను ప్రామాణికంగా తీసుకుని అప్పుడు అమ్ముడుపోయిన బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ మద్యం షాపులకు ఇవ్వనున్నారు.

అలాగే అక్టోబరు నుంచి మూడు నెలలు మళ్లీ ప్రామాణిక కాలంగా తీసుకుని మరీ తక్కువగా అమ్ముడుపోయిన బ్రాండ్లను తీసుకోబోమని ఎక్సైజ్‌ శాఖ ఉత్పత్తిదారులకు స్పష్టంచేసింది. 50 బ్రాండ్లకు మించి ఉండవని ఇప్పటికే ఉత్పత్తిదారులకు సమాచారం ఇచ్చింది. అక్టోబరు నుంచి డిమాండ్‌ ఆధారంగా వాటిని కూడా క్రమంగా తగ్గిస్తూ రావాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. దీని బట్టి చూస్తే అంచలెంచాలుగా మద్యం బ్రాండ్లు తగ్గుతూ రానున్నాయి. అలాగే మద్యం ధరలని కూడా ప్రభుత్వం పెంచేందుకు సిద్ధమవుతుందని సమాచారం. ధరలు ఎక్కువ పెడితే కొనేవారి సంఖ్య కూడా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

 

Leave a Reply