ఖాళీ ఖజానాతో ఏపీ

Share Icons:

అమరావతి, ఏప్రిల్ 17,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి… నిర్వహణ ఖర్చులు ఎలాగూ తగ్గవు కదా… బిల్లులు పేరుకుపోయాయి. నిధుల కోసం ఉండే మార్గాల్ని ప్రభుత్వం వెతుక్కుంటోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.1.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. తీరా వాస్తవంలో ఖర్చులు చూస్తే… పరిమితి దాటిపోయింది. రూ.2.4 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అంటే అదనంగా పెట్టిన ఖర్చు రూ.49 వేల కోట్లు.

ఈసారి ఎన్నికలు రావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ లెక్క తప్పింది. ఆల్రెడీ ఉన్న పథకాలకు భారీ ఎత్తున నిధులను ఖర్చుపెట్టింది. అవికాక, ఎన్నికల  ముందు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, ముఖ్యమంత్రి యువనేస్తం వంటి స్కీముల కోసం ఖర్చుపెట్టింది. దీంతో ఇపుడు రూ.30 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి.

ఏప్రిల్ ముగిసేలోపు… రూ.8,200 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయట. కాంట్రాక్టర్లేమో… ఎప్పుడు చెల్లిస్తారో చెప్పమని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏప్రిల్‌లో చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రూ.14,000 కోట్లు … అంటే, ఈ నెలాఖరులోపు రూ.6000 కోట్లు అవసరం. ఇందుకోసం రిజర్వు బ్యాంకును రూ.1000 కోట్లు అప్పు అడగ్గా… ఏప్రిల్ మొదటి వారంలో ఆల్రెడీ రూ.5000 కోట్లు ఇచ్చిన రిజర్వ్‌బ్యాంక్ మళ్లీ రూ.1000 కోట్లు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.

ఇప్పుడు రోజువారీ ఖర్చులకే నిధుల కొరత ఉంది. ఇక ఉద్యోగుల జీతాలు, పోలవరం ప్రాజెక్టు, ఉపాధి పథకాలు ఇలా చాలా వాటికి వేల కోట్లు అవసరం. ఆ నిధులు ఎలా సమకూర్చుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాలు.

మామాట: లెక్కా డొక్కా తెలీక పోతే ఇలాగే అవుద్ది

Leave a Reply