‘ఎన్టీఆర్‌’లో మండలి పాత్ర…

AP deputy speaker mandali budda prasad acted in ntr biopic
Share Icons:

విజయవాడ, 13 అక్టోబర్:   

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. కథానాయకుడు’ అని రాజకీయ జీవితానికి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’ అనే పేర్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, ఆయన అల్లుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా, ఏఎన్నార్‌గా సుమంత్ చేస్తున్నాడు. వీరితో పాటు కొందరు ప్రముఖుల పాత్రల్లో కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఎన్నికల ఏడాదిలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండో భాగం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కీలక నేత నటించారట. ఆయనే డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌. ఎన్టీఆర్ జీవితంలో దివి సీమ ఉప్పెన ఎపిసోడ్ కూడా చాలా ముఖ్యమైనది. ఆ సమయంలోనే, బాధితులను ఆదుకునేందుకు ఆయన జోలి పట్టుకుని చందాలు వసూలు చేశారు. అందుకే దీనిని బయోపిక్‌లో చూపించాలని డిసైడ్ అయింది చిత్ర బృందం. ఆ సందర్భంలోనే మంత్రిగా ఉన్న దివి సీమ గాంధీ అని పేరొందిన మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు పాత్రలో డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ నటించారని తెలుస్తోంది.

దివిసీమ ఉప్పెన విశేష సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, తెలుగు భాష కోసం పరితపించిన ఆయన పాత్రను కూడా ఈ సినిమాలో చూపించాలని నిర్ణయించుకున్న చిత్ర బృందం.. వెంకట కృష్ణారావు పాత్రలో ఆయన కుమారుడు మండలి బుద్ధ ప్రసాద్‌ను నటింపజేశారని, ఈ కారణంగానే ఆయన షూటింగ్ సమయంలో బాలయ్యతోనే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో స్వయంగా బాలకృష్ణే చొరవ తీసుకుని మండలిని కోరారని తెలిసింది. దీనికి సుముఖత వ్యక్తం చేసిన మండలి.. ప్రస్తుతం హంసల దీవి వద్ద జరుగుతున్న దివి సీమ ఎపిసోడ్‌లో నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మామాట: మంచి సీన్‌లోనే  నటించినట్లున్నారు…

Leave a Reply