కరోనా వ్యాప్తి లేదు…ఎన్నికలు నిర్వహించవచ్చు….

Share Icons:

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చు అని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విభేదిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా ఎన్నికల కమిషనర్ పైన విరుచుకుపడ్డారు. ఆయన పైన చర్యలు తీసుకోవలని కోరుతూ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసారు. దీని పైన అవసరమైతే ముందుకు వెళ్తామని స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు వాయిదా వేసిన కమిషనర్..అధికారుల పైన చర్యలు ఎలా తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. దీంతో..ఎన్నికల సంఘం కొందరు అధికారుల పైన చర్యలకు ఆదేశించింది. అయితే, ఆ నిర్ణయాలను సీఎం తప్పుబడుతున్నారు.

దీంతో..ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలా..లేక ముఖ్యమంత్రి మనోభీష్టం మేరకు అమలు చేయకుండా ఉండాలా…ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందనే మీమాంసలో సీఎస్ ఉన్నారు.

సాధారణంగా ఎన్నికల కమీషనర్ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైనే ఉంటుంది. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయాలను వ్యతిరేకించటంతో.. ఆ ఆదేశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెనుకడుగు వేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రభుత్వం అమలుచేయకపోతే కొత్త చిక్కులు వచ్చిపడతాయి. తమ ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయని పక్షంలో ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించవచ్చు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ అధికారాలే లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటంతో ఇప్పుడు ఈ వ్యవహారం సున్నితంగా మారింది. అయితే, తమకు ఉన్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాల అమలు గురించి జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను సంప్రదించగా, ఆయన స్పందించలేదు.

 

Leave a Reply