మండలి చిచ్చు: రద్దుపై జగన్ వ్యూహం? మూడు రోజుల్లో ఏం కానుంది?

Share Icons:

అమరావతి: మూడు రాజధానులపై రాష్ట్రంలో రగడ నడుస్తూనే ఉంది. అసెంబ్లీలో పాస్ అయిన మూడు రాజధానుల బిల్లు…మండలిలో టీడీపీ బ్రేక్ వేసింది. ఆ బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపింది. అయితే దీనిపై సీరియస్ గా ఉన్న సీఎం జగన్….అసలు ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్న మండలి ఉండాలా? దానిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని, సోమవారం కూడా అసెంబ్ల్లీ సమావేశం ఏర్పాటు చేసి దాని సంగతి తేలుద్దామని జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇక ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతుంది.

మండలి రద్దు..సెలెక్ట్ కమిటీకి బిల్లుల పైన న్యాయ పరంగానూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లులు ఏవి పెండింగ్ లో ఉన్నా..మండలి రద్దు ప్రతిపాదన అసెంబ్లీలో చేయటం వరకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, మండలి రద్దు నిర్ణయం అధికారికంగా ఆమోదించే సమయంలో మాత్రం కొన్ని అంశాల పైన కేంద్రం వివరణ కోరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని పైన న్యాయ నిపుణులతో చంద్రబాబు సమావేశ సమయంలో వారు కీలక అంశాలను చెప్పుకొచ్చారు. కీలకమైన బిల్లులపై శాసనమండలి పనిచేస్తూ.. వాటిని సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపించిన దశలో మండలిని రద్దు చేయడం కుదరదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో మరో అంశాన్ని వారు ప్రస్తావించారు. ప్రస్తుతం రాజధాని రైతులు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుల పైనా హైకోర్టుకు వెళ్లారు. అక్కడ చర్చల సమయంలో ప్రభుత్వం అధికారికంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో..మండలి రద్దు పైన ఏ విధంగా ముందుకెళ్లినా సెలెక్ట్ కమిటీ బిల్లులపైన ప్రభావం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వం మండలి రద్దు తీర్మానం ఆమోదించినా..రాష్ట్రపతి నోటిఫికేషన్‌ వచ్చేవరకూ మండలి పనిచేస్తూనే ఉంటుందని.. రాజధాని బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ కూడా ఏర్పాటై పని చేస్తూనే ఉంటుందని.. ఇవేవీ ఆగవని టీడీపీ నేత యనమల స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో జగన్ వ్యూహం మరోలా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మండలి రద్దుపై తేలుద్దామని చెబుతున్న జగన్…ఈ మూడు రోజుల్లో టీడీపీ ఎమ్మెల్సీలని తమ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ మేరకు మంత్రులు కూడా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అంటే టీడీపీ ఎమ్మెల్సీలు కొందరు వైసీపీలోకి వస్తే పరిస్థితులు తారుమారయ్యే అవకాశముంది.

 

Leave a Reply