వైసీపీలో వర్గపోరు…క్లాస్ తీసుకొనున్న జగన్….

ysr bharosa scheme implemented next year
Share Icons:

అమరావతి: అధికారం చేపట్టి ఐదు నెలలు కాకముందే  వైసీపీలో వర్గపోరు ముదిరిపోయింది. ఈ వర్గపోరుకు గుంటూరు వైసీపీ నేతలు ఆజ్యం పోయగా…మిగతా జిల్లాలు వారు కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ ల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకోవడంతో సీఎం జగన్ ఇరువురు నేతలకు క్లాస్ పీకారు. ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య వర్గపోరు ముదిరిపోయింది.

ఇటీవల తన మీద దాడి చేశారంటూ వెంకటాచలం ఎంపీడీఓ సరళ కోటంరెడ్డి మీద ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని బెయిల్ మీద విడుదల చేశారు.  అయితే, తన మీద ఎంపీడీఓ సరళ కేసు పెట్టడం వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి హస్తం ఉందని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ సరళ కేసు పెట్టడానికి వెళ్లినప్పుడు అక్కడకు కాకాణి అనుచరులు వచ్చి.. పోలీసులను దుర్భాషలాడారని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

కాగా, కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కోటంరెడ్డి ఎంపీడీఓ సరళకు ఫోన్ చేసి కోరుతున్నారు. కానీ ఆమె దానిపై స్పందించకపోవడంతో ఎం‌పి‌డి‌ఓ ఇంటికెళ్ళి కోటంరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎం‌పి‌డి‌ఓ కూడా పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఎం‌పి‌డి‌ఓ కు ఫోన్ చేసి వాటర్ కనెక్షన్ గురించి అడిగితే.. ‘మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నాడు.’ అని చెప్పినట్టు కోటంరెడ్డి వెల్లడించారు.

ఇదే విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కాకాణికి ఫోన్ చేస్తే.. ‘నీకు తెలీదు. నువ్వు ఊరుకో’ అని చెప్పినట్టు స్వయంగా శ్రీధర్ రెడ్డి మీడియాకు తెలిపారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళా అధికారి బాధితురాలిగా మారారు. ఎమ్మెల్యేల వర్గ పోరు వ్యవహారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఈ విషయంపై నేడు నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యి క్లాస్ తీసుకొనున్నారు.

 

Leave a Reply