పేద తల్లుల బ్యాంక్ ఖాతల్లో అమ్మఒడి నగదు…

ap cm ys jagan starts amma vodi scheme
Share Icons:

చిత్తూరు: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేటి నుంచి రూ.15 వేలు జమ కానుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

పిల్లల్ని బడికి పంపే పేద తల్లులకు ఈ పథకం కానుకగా ఇస్తున్నామన్నారు. అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏటా రూ.15వేలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి మేలు చేస్తుందన్నారు. నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయన్నారు.  పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే అమ్మ ఒడి పథకం తీసుకువచ్చామని సీఎం జగన్‌ తెలిపారు.

అటు ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ఉంటుందని, తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి ఇంగ్లీషు మీడియం పెంచుకుంటూ పోతామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని.. వాటిని అధిగమించాలన్నారు. తెలుగు మీడియం విద్యార్థులు ఇబ్బందులు పడకుండా.. బ్రిడ్జ్‌ కోర్సులు తీసుకువస్తామన్నారు. ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్‌ ఇస్తామని చెప్పారు. దీన్ని విమర్శించేవారు.. వారి పిల్లల్ని ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారని అన్నారు.

ఈ ఏడాది విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధన మినహాయిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 75శాతం హాజరు తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో 1 నుంచి 10వ తరగతి వరకే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని పేర్కొన్నామని.. కానీ ఇంటర్మీడియట్‌ వరకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్‌ కుమార్ చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాజధాని ముసుగులో చంద్రబాబు దోచుకున్నారని, బినామీ భూములు పోతాయన్న భయంతోనే.. అమరావతి రాజధాని ఉండాలని పట్టుబడుతున్నారని ఆరోపించారు.

 

Leave a Reply