పోలవరానికి నామం పెట్టిన కేంద్రం… కేంద్రానికి దండం పెట్టిన బాబు…

Share Icons:

అమరావతి, 1 డిసెంబర్:

పోలవరం మొదలైనప్పటి నుండి కేంద్రం వైపు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. తాజాగా కేంద్ర జలవనరుల శాఖా ముఖ్య కార్యదర్శి అమర్జిత్ సింగ్ పోలవరం టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలంటూ రాష్ట్రానికి లేఖ రాయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.

ఎప్పుడూ కేంద్రం విషయంలో మౌనంగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.

నిన్న అమర్జిత్ సింగ్ పోలవరం స్పిల్‌వే, స్పిల్ ఛానల్ టెండర్ల ప్రక్రియ ఆపాలంటూ రాష్ట్రానికి లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయం గురించి శాసనసభలోనూ, సభ బయట కూడా చంద్రబాబు మాట్లాడారు.

శాసనసభలో:

“అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్రం 2500 కోట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా చాలా రావాల్సి ఉంది.

ప్రత్యేకహోదా ఇవ్వలేము, దానిలో ఉన్నవన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని చెప్పినా ఒప్పుకున్నా. విభజన చట్టంలోని హామీల గురించి ఎప్పటికప్పుడూ కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నా.

పోలవరం కోసం ఇంకా 60వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అందులో 98వేల గిరిజన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ భూసేకరణ చేయకపోవడం వల్ల దాని వ్యయం 32వేల కోట్ల వరకు పెరిగింది.  పోలవరం నిర్మాణానికి ఇప్పటికి 12వేల కోట్లు ఖర్చు చేశాం, ఇంకా 42వేల కోట్లు అవసరం ఉంది.

ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలన్నదే మా లక్ష్యం. ఇలా అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం తగదు. దీనికి ముందు ప్రాజెక్టుని నాబార్దుకి ఇస్తాం అన్నారు. అది రాష్ట్రం చేతుల్లో ఉంటేనే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందని చెప్పి నిర్మాణ భాద్యతలను రాష్ట్రం తీసుకుంది.

కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నారు, మరికొందరు ప్రాజెక్టుపై కోర్టులో కేసులు వేస్తున్నారు. వీటన్నిటినీ ఒకపక్క ఎదుర్కొంటూనే ఇంకోపక్క ఆర్ధికపరిస్థితి బాగోకపోయినా ప్రాజెక్టు కోసం ఖర్చు పెడుతున్నాం” అంటూ కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు.

సభ బయట:

సభ నుండి బయటకి రాగానే “పోలవరం  టెండర్లు నిలిపివేస్తున్నారా?” అంటూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఈవిధంగా సమాధానమిచ్చారు బాబు.

“పోలవరం నిర్మాణ ప్రక్రియ మొత్తం కేంద్రానికి వివరిస్తాం. అయినా ఆపేయ్యాలని చెప్తే ప్రాజెక్టునూ కేంద్రానికే అప్పగిస్తాం. మాకు ప్రాజెక్టు పూర్తి కావడం ముఖ్యం. ప్రాజెక్టు కోసం సాయం చేయాలని కేంద్రాన్ని పదే పదే కోరుతూనే ఉన్నాం. ఇంకా సాయం చేయలేం అని వారు చెప్తే ఏం చేస్తాం? నమస్కారం పెట్టి తప్పుకుంటాం.

ఇప్పటి వరకు 4వేల కోట్ల రాష్ట్ర నిధులని పోలవరం కోసం ఖర్చు చేశాం. ప్రాజెక్టుని పూర్తి చెయ్యాలన్నదే మా లక్ష్యం. అలా కాకుండా కేంద్రమే ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువు లోగా  పూర్తి చేస్తామని హామీ ఇస్తే రాష్ట్రం అంతా ఒప్పుకుని పనులన్నీ కేంద్రానికే అప్పగిస్తాం.

కావాలంటే సుమోటోగా కూడా తీసుకోవచ్చు. ఎవరు చేసినా ప్రోక్ట్ పూర్తి కావడమే మా ధ్యేయం. ఇందులో రెండో ఆలోచనే లేదు ” అంటూ చంద్రబాబు మీడియాలు వివరణ ఇచ్చారు.

మామాట: దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షు అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.

Leave a Reply