వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్..

Share Icons:

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పెన్షన్ల పెంపు, ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడం, గ్రామ వాలంటీర్, సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం లాంటివి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ మార్కెట్ యార్డ్ కమిటిల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా  ప్రభుత్వ రంగ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించే ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి, విధానాలతో కూడిన ప్రతిపాదనలపై ఆయన ఆమోదం తెలిపారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన అదేశించారు.

సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తుంటారు. శాశ్వత ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత.. వారి ఖాళీలను ఔట్ సోర్సింగ్ ద్వారా అప్పటికప్పుడు భర్తీ చేయడానికి ఉద్దేశించిన విధానం ఇది. వేతనాలు తక్కువే అయినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారు విధులను నిర్వర్తిస్తుంటారు. అయితే వీరికి రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. వీటి కోసం ఔట్ సోర్సింగ్ వాళ్ళు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పించాలని, ఇందులో 50 శాతం మహిళలతో భర్తీ చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించే ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లను తప్పనిసరి చేశారు.

ఇక ఈ నిర్ణయంతో పాటు జగన్ మరొకటి తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ ప్రజాధనం ఆదానే లక్ష్యంగా రూ. 10 లక్షల నుంచి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రూ. 10లక్షల ఆపైన విలువ చేసే పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కోసం నిర్వహించే టెండర్లలో పారదర్శకతకు పెద్ద పీట వేయడంలో భాగంగానే ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. ఇక సీఎం ఆదేశాల ప్రకారం జనవరి 1 నుంచి ఈ కొత్త పాలసీ అమల్లోకి రానుంది. రూ. 100 కోట్లకుపైనా కాంట్రాక్టుల్ని ముందస్తుగా న్యాయసమీక్ష ప్రక్రియకు నివేదించడం ద్వారా తాము విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని సీఎం చెప్పుకొచ్చారు.

 

 

Leave a Reply