టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణకు జగన్ సిఫార్సు: అండగా ఉంటానన్న బాబు

ap cm jagan recommended cbi inquiry on tdp former mla and chandrababu ready to help tdp leader
Share Icons:

అమరావతి:

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణకు జగన్ సిఫార్సు చేశారు. ఈరోజు ఇసుకపై కొత్త పాలసీ రూపొందించిన ఏపీ కేబినెట్ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అక్రమాలకు పాల్పడిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది.

కాగా, ఇటీవల గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన అక్రమ మైనింగ్ పైన హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణ చేసి కోర్టుకు నివేదిక సమర్పించింది. అందులో అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని స్పష్టం చేసింది. దీంతో..కోర్టు దీని పైన సీబీఐ విచారణ పైన రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కోర్టు సూచనల మేరకు ఏపీ మంత్రివర్గం ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీఐ కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో ప్రధానంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పాత్ర పైనే విచారణ సాగుతోంది.

అయితే సీఐడి విచారణ పైన కోర్టులో వాదనలు సాగుతున్నాయి. బ్యాంకు లావాదేవీల పైన ఫోకస్ పెట్టాలని హైకోర్టు సూచించింది. దీంతో.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించటంతో యరపతినేనికి ఉచ్చు బిగిసినట్లుగానే కనిపిస్తోంది. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణకు వెళ్లడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. యరపతినేనికి అండగా నిలవాలని నిర్ణయించారు. టీడీపీ నేతలపై కావాలనే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 8 మంది టీడీపీ నేతలను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఈరోజు ఏపీ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. ఇసుక టన్ను ధర రూ. 375గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దశలవారీగా ఇసుక రీచ్లు , స్టాక్ పాయింట్లు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలి దశలో 58 స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీఏండీపీ సైట్ ద్వారా ఇసుకని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అదేవిధంగా ఆశావర్కర్ల వేతనాల పెంపునకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెరగనున్నాయి. సొంత ఆటోలు, ట్యాక్సీలు ఉండి, వాటిని నడుపుకొనే వారికి ఏటా రూ.10వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద ఏపీ కేబినెట్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అలాగే మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply