అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ అండ: ఆనందంలో బాధితులు

Share Icons:

అమరావతి: తన పాదయాత్రలో ఇచ్చిన హామీలని జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అలాగే అప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన మాటని…జగన్ తాజాగా మాట నిలుపుకున్నారు.  గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో కొందరు అగ్రిగోల్డ్ బాధితులకు ఆయన చెక్ లు అందజేశారు. అనంతరం  బహిరంగ సభలో మాట్లాడారు. ‘3.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు వేస్తున్నాం. రూ.10 వేలలోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తాం. నా పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు. వారి ఆవేదన అర్థం చేసుకున్నాను. తొలి కేబినెట్ లోనే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’ అని జగన్ అన్నారు.

‘గత ప్రభుత్వ పాలనలోనే అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగింది.. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మేము కేవలం ఐదు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదికి రూ.10 వేలిస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం’ అని జగన్ వ్యాఖ్యానించారు.

అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ ఈ ఉదయం మొదలైంది. సీఎం వైఎస్ జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం రూ. 264 కోట్లను బదలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు.

కాగా, ల్యాప్ టాప్ లో జగన్ బటన్ నొక్కగానే, వేలాది మంది ఖాతాల్లో వారి డిపాజిట్ జమ అయింది. పలువురు తమ సెల్ ఫోన్లను చూపిస్తూ, తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయన్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నరసన్నపేట మండలం, కిల్లం గ్రామానికి చెందిన బాధితుడు పొట్నూరు శ్రీనివాసరావు, తన అకౌంట్ లో రూ. 10 వేలు జమ అయ్యాయని చెబుతూ, సెల్ ఫోన్ చూపుతున్న ఫోటో వైరల్ అవుతోంది.

 

Leave a Reply