ఎస్సీలను విడగొట్టి పాలించాలని చంద్రబాబు చూశారు…

tdp leader chandrababu comments on ysr
Share Icons:

అమరావతి: అసెంబ్లీ ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని, ఎస్సీ కమిషన్ బిల్లును కూడా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఉద్ఘాటించారు. ఎస్సీల అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఎస్సీలకు మంచి జరగకూడదనే దురుద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని, ఎస్సీ కమిషన్ బిల్లు పాస్ కాకుండా చేసిన హీనమైన చరిత్ర టీడీపీది అని విమర్శించారు. ఎస్సీలను విడగొట్టి పాలించాలని చంద్రబాబు చూశారని అన్నారు. ఎస్సీలందరూ ఒక్కటిగా ఉండాలనేది తమ ప్రయత్నం అని సీఎం చెప్పారు. ఎస్సీలపై టీడీపీకి ఉన్న గౌరవం ఇదేనా? అని సీఎం ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేనే గెలిచాడని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే అటు శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ ఇంకా మొదలు కాలేదు. మొదట టీడీపీ ఇచ్చిన రూల్ 71 పై చర్చకు స్వీకరించడంతో మండలిలో అధికార పక్షం ఆందోళన చేయడంతో సభ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే మండలి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లాబీలో యనమల, లోకేశ్‌ మండలి రద్దు ప్రచారంపై  మాట్లాడారు. మండలి రద్దుపై ప్రభుత్వానికి అధికారం ఎక్కడుందని ప్రశ్నించారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం మాత్రమే చేయగలదని లోకేష్ అన్నారు.

తాము కూడా మండలిలో తీర్మానం చేయగలమని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ అంటే.. ప్రభుత్వం రద్దు అంటోందని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా 15 మంది మంత్రులు సభకు వచ్చారని, అధికార పార్టీ నేతలు మండలిలో ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. శాసనమండలిని రద్దు అంత సులభం కాదని యనమల రామకృష్ణుడు అన్నారు. కౌన్సిల్ రద్దు చేయాలంటే చాలా ప్రక్రియ ఉందని, పార్లమెంటు నిర్ణయంతోనే మండలి రద్దు అసాధ్యమవుతుందని ఆయన అన్నారు.

 

Leave a Reply