చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ

Share Icons:

తిరుపతి, నవంబర్ 6,

టీడీపీ – కాంగ్రెస్ పొత్తుపై చిత్తూరు జిల్లాలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. రెండు పార్టీల నాయుకులలో పొత్తుపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. కాంగ్రెస్, టీడీపీ నేతలతో పాటు సీపీఐ జాతీయ నాయుకుడు నారాయణ కూడా దీన్ని శుభపరిణామంగానే చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ చింతా మోహన్ అయితే దీన్ని తాను ఎప్పుడో ఊహించానన్నారు. ఎన్టీఆర్ మరణించక ముందు.. ఆయన కూడా కాంగ్రెస్‌కు స్నేహహస్తం అందించాలని భావించారని, ఆ విషయాన్ని సాక్షాత్తు ఎన్టీఆరే తనతో చెప్పారని చింతా మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఉనికి కోల్పోయింది. ఒకరిద్దరు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులు కూడా లేరు. ఇంతకుముందు పార్టీకి పెద్దదిక్కుగా ఉండే పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి.. వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. అలాగే వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి టీడీపీలో చేరిపోయారు. నగరి నియోజకవర్గంలోని సీనియర్ నాయకుడు రెడ్డివారి చెంగారెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేసే సీకే బాబు ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరినా.. ఆ పార్టీలో కొనసాగడం లేదని తెలిసింది. మరో మాజీ మంత్రి కుతూహలమ్మ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయిందని చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో చింతా మోహన్‌తో పాటు, ద్వితీయశ్రేణి కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమకు ఒకటో రెండో సీట్లు కేటాయించకపోతారా, అక్కడ గెలవకపోతామా అనే ధీమాతో ఉన్నారు. మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని పొత్తు పెట్టుకున్న పార్టీలకే ఇస్తూ వచ్చింది. 2009 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీ చేసి, చింతా మోహన్ చేతిలో పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో తిరుపతిని బీజేపీకి కేటాయించారు. అదే తరహాలో రానున్న ఎన్నికల్లో కూడా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కేటాయించవచ్చుననే ధీమాతో చింతా మోహన్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో సీట్ల సర్దుబాటు కు సంబంధించి సమస్యలు రాకపోవచ్చునని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. చిత్తూరు, నగరి నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. చిత్తూరు జిల్లాలో రెండు లేదా మూడు శాసన సభా నియోజకవర్గాలతో పాటు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కేటాయిస్తా రని సమాచారం.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడంతో, తమ పార్టీ తుడిచిపెట్టుకుని పోతుందనే భయంతో ప్రధాని మోదీలో గుబులు పుట్టుకుందని టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని అభిప్రాయపడ్డారు.తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కలయిక శుభపరిణామం అని రెండు రోజుల పర్యటనకు చిత్తూరు జిల్లాకు వచ్చిన సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే వేదిక ఏర్పడిందని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వద్దకు వెళ్లి మళ్లీ నువ్వే ఎమ్మెల్యేవు అవుతావని ఆశీర్వదించి వచ్చారు. చంద్రగిరి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పులివర్తి నాని వద్దకు కూడా వెళ్లి, 2019లో ఎమ్మెల్యేగా నానిని చూస్తామని బహిరంగ ప్రకటన చేశారు.తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తుకు సంబంధించి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఈరెండు పార్టీల పొత్తును విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహరావు జిల్లా పర్యటనకు వచ్చి రెండుపార్టీల పొత్తును విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని, వాటికి ఇంతవరకు లెక్కలు చెప్పలేదని అన్నారు. ఈ రెండు పార్టీలు ఒక ఒరలో ఇమడవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేకపోయారని, ఇక రాష్ట్రానికి, దేశానికి ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.

 

మామాట: కాంగ్రెస్ కోటలు బీటలు వారడం ఎపుడో మొదలయ్యింది కదా. 

Leave a Reply