ఆ రెండు పదవుల కోసం చాంతాడంతా క్యూ

Share Icons:

విజయవాడ, సెప్టెంబర్ 6:

ఎన్నికల ముందు.. ఏపీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం పొందబోయే అదృష్టవంతులు ఒకరా… ఇద్దరా? అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. బీజేపీకి పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాలతో రాష్ట్ర మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.

అయితే ఇటీవల చంద్రబాబునాయుడు తన కేబినెట్‌లోమం‌త్రి వర్గ విస్తరణ ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. కానీ హరికృష్ణ హఠాన్మరణం వల్ల.. వాయిదా పడిందన్నారు. ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రెండు, మూడు సార్లు ప్రకటించారు. ముస్లిం మైనారిటీల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతోందనన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ఇద్దరే రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒకరు శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ కాగా.. మరొకరు మండలిలో ప్రభుత్వ విప్‌ ఎంఏ షరీఫ్‌. ఎమ్మెల్యేలుగా జలీల్‌ ఖాన్‌, చాంద్‌బాషా ఉన్నా వారిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఉండకపోవచ్చు.

మంత్రివర్గంలో ప్రస్తుతం ఎస్టీలు కూడా ఎవరు లేరనే చర్చ కూడా చాలా రోజుల నుంచి జరుగుతోంది . అందువల్ల ఆ వర్గానికి కూడా చోటిస్తే బాగుంటుందని కొందరు సీనియర్లు సూచించడంతో, మంత్రివర్గంలోకి మైనారిటీలను తీసుకుంటామని గుంటూరు సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే ముడియం, సంధ్యారాణిల్లో ఒకరికి చోటు దక్కవచ్చని అంటున్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.  ఈ నెల 19వ తేదీ వరకు ఇవి జరుగుతాయి. ఆ తర్వాతే విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మామాట: మరి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో?

Leave a Reply