ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్ అయినట్లేనా?

Share Icons:

అమరావతి: మార్చి 15వ తేదీ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు కూడా పూర్తి చేసుకుని, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటితే మూడు రాజధానులకు ప్రజల మద్దతు లభించినట్టేననే అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీరాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది.

గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని – అభివృద్ది వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే, శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసనమండలిలో బ్రేక్ పడింది. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించడంతో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసింది.

ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో… సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం జగన్… ఆయనతో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా సీఎం జగన్ ప్రధాని మోదీకి వివరణ ఇచ్చారు.

 

Leave a Reply