బడ్జెట్ సమావేశాలు కూడా ఈ నెలలోనే…స్థానికం తర్వాతే..

finance minister buggana rajendranath introduce ap budget
Share Icons:

అమరావతి: సీఎం జగన్‌కు మార్చి నెలలోనే చాలా పనులు పూర్తి చేయాల్సిన అవసరమొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు తప్పనిసరిగా ఈ నెలలోనే పూర్తి చేయాలి లేదంటే ఆర్ధిక పరంగా ఏపీకి బాగా నష్టం జరగనుంది. స్థానిక సమస్యల ఎన్నికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే… కేంద్రం నుంచి రావలసిన స్థానిక సంస్థల నిధులు రూ. 3వేల కోట్లకు పైగా నిలిచిపోనున్నాయి. ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రం కేంద్రం నిధులు వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

ఈ నెల 31 లోగా కనీసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను అయినా ఆమోదించకపోతే ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఈ నెల 27వ తేదీకల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు 28వ తేదీ నుంచి సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ నోటిఫికేషన్‌తో ప్రక్రియ మొదలు కానుంది. 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి 24వ తేదీన మున్సిపల్ ఎన్నికలు 27వ తేదీన పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే ఈనెల 28న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు పాటు మాత్రమే జరుగుతాయని సమాచారం. 28వ తేదీనే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడతారని తెలుస్తోంది. అదికూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కే పరిమితం చేస్తారని సమాచారం. ఇక 29వ తేదీ సెలవు ఉంటుంది. 30వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చ ఉంటుందని సమాచారం.

ఇక 31వ తేదీ మూడు నెలలకు సరిపడా బడ్జెట్ అయిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపడం జరుగుతుందని సమాచారం. ఇక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో సమావేశాలు వాయిదా పడుతాయి. ఆ తర్వాత తిరిగి జూన్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ఉంటుందని సమాచారం.

 

Leave a Reply