అసెంబ్లీలో మాటల యుద్ధం: చంద్రబాబు వర్సెస్ జగన్

Share Icons:

అమరావతి, 18 జూన్:

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, సీఎం జగన్‌లు ప్రత్యేకహోదాపై హోరాహోరీగా విమర్శలు చేసుకున్నారు.

మొదట జగన్ మాట్లాడుతూ….మార్చి 2014లోనే ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిసిందని, ఏడు నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిందని  గుర్తు చేశారు. అప్పటి వరకూ ‘హోదా’ గురించి చంద్రబాబు పట్టించుకోలేదని, నీతి ఆయోగ్ ఏర్పడిన తొమ్మిది నెలల తర్వాత బాబు స్పందించారని విమర్శించారు.

దీనిని బట్టి ‘హోదా’పై చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని అన్నారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ ను చంద్రబాబు అడిగారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘హాదా’ హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ కు కనీసం ఓ లేఖ కూడా చంద్రబాబు రాయలేదని విమర్శించారు.

ఏపీకి ముంపు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయనని చెబుతున్న చంద్రబాబు, ‘ప్రత్యేక హోదా’ ఏం పాపం చేసిందని దాని కోసం పోరాడకుండా వదిలేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక జగన్‌కు కౌంటర్‌గా చంద్రబాబు మాట్లాడుతూ…. జగన్ తనపై చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవం కాదని చంద్రబాబు బదులిచ్చారు. ప్లానింగ్ కమిషన్ వద్దకు తాను వెళ్లి ప్రయత్నం చేయలేదన్న మాట తప్పుడు ఆరోపణ అని అన్నారు.

ప్లానింగ్ కమిషన్ పేరుతో తనపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని, తన మీద బురద చల్లినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదని,  మీరు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్నారని,  కదా, సాధించండని చెప్పారు. ఇక జగన్ మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు కదా, వాళ్లతో ప్రత్యేక హోదా సాధించమనే చెబుతున్నాం. ప్రత్యేకహోదా కోసం టీడీపీ ప్రయత్నాలను తప్పుబట్టడం సరికాదని అన్నారు.

ఇక బీజేపీతో స్నేహపూర్వకంగా ఉంటూనే వారితో విభేదించామని,  అప్పట్లో మేం శాలువాలు కప్పామని, మెమెంటోలు ఇచ్చామని అంటున్నారు, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కూడా శాలువాలు, మెమెంటోలే ఇస్తున్నారు, వచ్చే ఐదేళ్లలో మీరు ఇచ్చేవాటితో బీరువాలు, రూములు కూడా నిండిపోతాయి ” అంటూ చంద్రబాబు ఓ సెటైర్ తో తన ప్రసంగాన్ని ముగించారు

Leave a Reply