20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం….ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన జే‌ఏ‌సి…

Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ కమిటీ ఇప్పటికే మూడు రాజధానుల కాన్సెప్ట్‌కి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. అటు హైపవర్ కమిటీ సైతం శుక్రవారం జగన్‌తో సమావేశమై తుది చర్చలు జరిపింది. ఈ క్రమంలో శనివారం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అనంతరం 20న జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఏపీ రాజధానుల అంశంపై చర్చిస్తారు.

అయితే అసెంబ్లీ సమావేశం జరిగే రోజే పొలిటికల్ జేఏసీ చలో అసెంబ్లీకి పిలునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం మంగళగిరిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు లోకేష్ పొలిటికల్ జేఏసీ ఆధ్యర్యంలో ర్యాలీలో బైక్ నడిపారు. సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 20న చలో అసెంబ్లీకి మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు లోకేష్.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ….ఏపీ రాజధాని విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా సాగవు. ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమం జరగనుంది. అమరావతి పరిరక్షణ కోసం మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలి. 144 సెక్షన్ విధించి మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నారు. సీఎం జగన్‌కు కోర్టులన్నా, రైతులన్నా గౌరవం లేదు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అని జగన్ అనే వరకూ ఉద్యమం ఉధృతం అవుతూనే ఉంటుంది.

 

Leave a Reply