ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ మిస్సింగ్…నా దగ్గరే ఉన్నాయన్న కోడెల

Share Icons:

అమరావతి:

 

ఏపీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని 2017, మార్చిలో అమరావతికి తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీకి చెందిన కొంత ఫర్నీచర్ తో పాటు ఏసీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీకి హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ ను తరలిస్తుండగా, కొంత మాయమైందని అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదులో తెలిపారు. కాగా, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నప్పుడే ఈ ఫర్నీచర్ మాయమయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీకి సామగ్రిని తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను వినియోగించుకున్నానని కోడెల తెలిపారు.

 

తన దగ్గరున్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాల్సిందిగా అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాశానని, కానీ అసెంబ్లీ అధికారులు తన లేఖపై ఇంతవరకూ స్పందించలేదని ఆయన చెప్పారు. ఇప్పటికైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని కోడెల స్పష్టం చేశారు. లేదంటే ఈ ఫర్నీచర్ కోసం ఎంత ఖర్చయిందో చెబితే తాను చెల్లించేందుకు సిద్ధమేనని కోడెల చెప్పారు.

Leave a Reply