మోడీ స‌ర్కారు సాధించిన మ‌రో విజ‌యం

Share Icons:

మోడీ స‌ర్కారు సాధించిన మ‌రో విజ‌యం

దేశ‌వ్యాప్తంగా అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధిస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు విజ‌య‌గ‌ర్వం త‌ల‌కెక్కినట్లుగా క‌నిపిస్తున్న‌ది. పార్టీ పుట్టిన త‌ర్వాత తొలి సారి లోక్‌స‌భ‌లో 24 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తూ బిజెపి సాధార‌ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వ‌చ్చింది.

ఎన్నిక‌ల‌లో క‌లిసి పోటీ చేసినందున మెజారిటీకి అద‌న‌పు ఓట్లు అవ‌స‌రం లేక‌పోయినా తెలుగుదేశం లాంటి మిత్ర ప‌క్షాల‌కు అధికారంలో భాగస్వామ్యం క‌ల్పించింది.

ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఢిల్లీ, బీహార్ లాంటి రాష్ట్ర‌ల‌లో త‌ప్ప దాదాపుగా అన్ని చోట్లా బిజెపి జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

ఇవ‌న్నీ కాద‌న‌లేని నిజాలు. వాటితో బాటు మ‌రో కాద‌న‌లేని నిజం కూడా వెలికి వ‌స్తున్న‌ది.

అదే క‌మ‌ల‌నాథుల‌కు త‌ల‌కెక్కిన విజ‌య‌గ‌ర్వం.

ఒక వైపు త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తుండ‌గా- త‌న‌కో వాట్స‌ప్ మెసేజి వ‌చ్చింద‌ని, దాని సారాంశం ఇట‌లీలో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని- చెబుతూ రాహుల్ గాంధీ ఇక ఇండియాలో గెల‌వ‌లేరు, ఇట‌లీ ఎన్నిక‌ల కోసం వెళ్లాల‌నే అర్ధం వ‌చ్చే విధంగా బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా నవ్వుతూ ఎగ‌తాళి చేశారు.

ఇది విజ‌యం తెచ్చిన గ‌ర్వం అంటే.

ఎన్నిక‌ల‌లో ఓడిపోయినంత మాత్రాన ఏ పార్టీ ప‌నికిమాలిన పార్టీ కింద‌కు జ‌మ‌క‌ట్ట‌డానికి వీల్లేదు. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తే బ‌ళ్లు ఓడ‌లు కావ‌చ్చు. ఓడ‌లు బ‌ళ్లూ కావ‌చ్చు.

దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామ‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీ కాబ‌ట్టి అలానే చెబుతారులే అని స‌రిపుచ్చుకున్నారు.

కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌ర్వాత క‌మ‌ల‌నాథులు, సంఘ్ ప‌రివార్ వారు అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న భావ‌జాలంపై దెబ్బ కొట్ట‌డం ప్రారంభించారు. చాలా ప్రాంతాల‌లో మాన‌వ‌హ‌క్కుల సంఘాల వారిపైనా, వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న‌వారిపైనా దాడులు చేశారు.

త‌మ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన వారిపై న‌ల్ల ఇంకు పూశారు.

ఆ త‌ర్వాత గోవ‌ధ‌పై ర‌భ‌స చేశారు. ఆవుల‌ను క‌బేళాకు త‌ర‌లిస్తున్న వారిపై అఘాయిత్యాలు చేశారు. వారిని క‌ట్టేసి కొట్టారు. ఒక చోట అయితే చంపేశారు. దాద్రిలో పశుమాంసం తిన్నాడనే అనుమానంతో ఒక నిస్సహాయుడిపై దాడి చేసి హతమార్చారు.

ఆ వెంటనే ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటిన్‌లో పశుమాంసం తింటున్నారనే ఆరోపణను ఆధారం చేసుకొని పోలీసులు దాడి చేశారు. ఈ దాడి తరువాత తమకు వచ్చిన ఫిర్యాదు వాస్తవం కాదని పోలీసులు తెలుసుకున్నారు.

అయినా మత విద్వేషాలను రెచ్చగొట్టినందుకు బీజేపీ పరివారంపై పార్టీ నాయకత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.

18 వ శతాబ్దానికి చెందిన పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయిస్తే, దానిని గిరీశ్ కర్నాడ్ సమర్థించారు.

దీంతో వారు ఆయనను హతమారుస్తామని బెదిరింపులకు దిగారు. టిప్పు జయంతిని జరపకూడదంటూ నానా గొడవ చేశారు.

అంత‌కు ముందు ప్ర‌జార‌చ‌యిత‌ క‌ల్బుర్గిని హ‌త‌మార్చారు. ఆ త‌ర్వాత గౌరీలంకేష్ హ‌త్య‌కు గుర‌య్యారు.

బిజెపి అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో చాలా రాష్ట్రాల‌లో ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. దేశంలో భావ ప్ర‌క‌ట‌నాస్వేచ్ఛ లేద‌ని మేధావులు గ‌గ్గోలు పెట్టారు. చాలా మంది త‌మ‌కు ప్ర‌భుత్వం అందించిన అవార్డుల‌ను వాప‌సు ఇచ్చేశారు.

అయినా ప్ర‌భుత్వం ఎలాంటి స్పంద‌న క‌న‌బ‌ర‌చ‌లేదు. తాము అనుకున్న‌ది జ‌రుగుతున్న‌ట్లుగా సంతోష‌మే వ్య‌క్తం చేసింది. ఒక‌ప్పుడు డాక్ట‌ర్ మన్మోహన్ సింగ్ గురించి దేశ ప్ర‌జ‌ల‌కు ఎన్నో ఆశలు ఉండేవి. కానీ ఆయన పాలనంతా అవినీతితో, అచేతనత్వంతో సాగింది.

మన్మోహన్ కానీ, సోనియా లేదా రాహుల్ కానీ దేశాన్ని ముందుకు నడిపించలేరని ప్రజలకు అనిపించింది. దీంతో వారు మోడీకి పట్టం కట్టారు.

దేశం ముందుకు సాగడానికి అడ్డంకిగా నిలచిన రాజకీయ సంకెళ్ళను మోడీ మాత్రమే తెంచగలరని ప్రజలు భావించారు.

ఆయనలో అవినీతి లేకపోగా, దేశాభివృద్ధి పట్ల ఆయనకు ఒక స్పష్టమైన దృక్పథం ఉన్నదని ప్రజలు అనుకున్నారు.

పైగా ఆయన నిర్ణయాత్మకంగా వ్యవహరించే నేత కనుక, ఆయన నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని నమ్మారు. అందుకే ప‌ట్టం గట్టారు.

ఆయ‌న అధికారంలోకి రాగానే జ‌రిగిన ఈ దాడుల‌ను కూడా దేశ ప్ర‌జ‌లు ఓపిక‌తో గ‌మ‌నించారు.

వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న వారు కూడా మౌనం పాటించారు. దేశంలో శాంతి నెల‌కొన్న‌ది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

విగ్ర‌హాల‌ను కూల్చ‌డం దేనికి సంకేతం?

త్రిపుర‌లో లెనిన్ విగ్ర‌హాన్ని కూల్చ‌డం, త‌మిళ‌నాడులో పెరియార్ రామ‌స్వామి విగ్ర‌హానికి అప‌చారం చేయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు మొద‌ల‌య్యాయి.

మ‌ళ్లీ పాత ప‌రిస్థితులు పున‌రావృతం కానున్న భావ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌ళ్లీ అంద‌రిలో భ‌యం తొంగి చూస్తున్న‌ది.

పాల‌న‌పై ఉన్న అసంతృప్తిని కప్పి పుచ్చుకోవ‌డానికి భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఏ రాజ‌కీయ పార్టీకైనా మంచి పేరు తీసుకురాదు.

విజ‌య‌గ‌ర్వం అస్స‌లు ప‌నికి రాదు.

Leave a Reply