టీడీపీకి భారీ షాక్: ఇద్దరు బడా నేతలు ఔట్…?

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి: ప్రతిపక్ష టీడీపీకి గట్టి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్, పార్టీని వీడేందుకు రంగం సిద్ధమైంది. నేడు ఆయన తన అనుచరులతో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించనున్నారని సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆయన, తెలుగుదేశం పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన వర్గీయులు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యంగా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆగ్రహం ఆయనలో నెలకొనివుందని అంటున్నారు. కాగా, కేఈ ప్రభాకర్ ఏ పార్టీలో చేరనున్నారన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కొందరు వైసీపీలో చేరుతారని, మరికొందరు బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు చేస్తున్నారు.

మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్దా రాఘవరావు కూడా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన కూడా వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

శిద్దా రాఘవరావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు.. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటారు. 2004లో ఆయన టీడీపీ తరపున ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత నియోజకవర్గం మారి.. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ దర్శి నుంచి బరిలోకి దిగాలని భావించారు. కానీ జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలతో దర్శిని వదిలేసి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

 

Leave a Reply