ఈ సారి విశాఖ వంతు…టీడీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే…

main leaders ready to leave tdp
Share Icons:

విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీలో చేరడం, పులివెందులకు చెందిన సీనియర్ నాయకుడు ఎస్వీ సతీష్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పిన  విషయం తెలిసిందే. ఇక సీనియర్ నేత రామసుబ్బారెడ్డి కూడా నేడు వైసీపీలో చేరనున్నారు.

ఈ క్రమంలోనే మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పార్టీని వీడారు. టీడీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే కారణంతో విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా ప్రకటించారని, దాన్ని వ్యతిరేకించడం సరి కాదని అన్నారు. అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయమని డిమాండ్ చేయడం తప్పు కాదని, అదే సమయంలో విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించడానికి కారణమే లేదని చెప్పారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ వల్ల పార్టీలో ముఠా సంస్కృతి ఏర్పడిందని పంచకర్ల రమేష్‌బాబు విమర్శించారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడాన్ని స్వాగతిస్తోన్న సీనియర్ నాయకులను లెక్క చేయట్లేదని ఆరోపించారు. విశాఖపట్నం రాజధానిగా స్వాగతిస్తోన్న ఉత్తరాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. తమలో తమకే గొడవలు పెట్టేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడిన ప్రాంతమో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వందలాది మంది ఉపాధి కోసం వలసలు వెళ్తుంటారని అన్నారు. ఈ విషయం టీడీపీ నాయకత్వానికి తెలియనిది కాదని అన్నారు. అలాంటి ప్రాంతాంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడాన్ని పార్టీ నాయకులు స్వాగతించి ఉండాల్సిందని పంచకర్ల చెప్పారు.

 

 

Leave a Reply