తెలుగుదేశం మెడ‌కు మరో ఉచ్చు

Share Icons:

తెలుగుదేశం మెడ‌కు మరో ఉచ్చు

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 15ః

ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల‌లో ఇరుక్కుని ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మ‌రో చిక్కు వ‌చ్చిపడింది.

ఎంతో ఆర్భాటంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు కుల‌స్తుల‌కు రిజర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ అంశంపై ఒక క‌మిష‌న్‌ను నియ‌మించింది.

ఆ మ‌ధ్య ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆధ్వ‌ర్యంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్య‌మించ‌డం త‌దిత‌ర ఘ‌ట‌న‌లు తెలిసిందే.

వీట‌న్నింటి నేప‌థ్యంలోక‌మిష‌న్ నివేదిక‌ను బ‌ల‌వంతంగా తెప్పించుకుని రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ఏక‌గ్రీవ తీర్మానం చేసి, బిల్లు తయారు చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఒక‌టి ఉంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన‌ కాపుల రిజ‌ర్వేష‌న్ తీర్మానం, బిల్లు ఆ శాఖ‌కు వెళ్లింది.

దీనిపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రిపిన డీఓపీటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పంపిన బిల్లు రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పున‌కు భిన్నంగా ఉంద‌ని డీఓపీటీ గుర్తు చేసింది.

1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి లేదనీ, ఒకవేళ అంతకు మించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులు గానీ అవసరమని పేర్కొంది.

అయితే ఈ బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది.

అలాగే రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు ‘సముచిత రీతిలో’ కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్ని కూడా గుర్తుచేసింది.

ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించ వ‌చ్చని అభిప్రాయపడింది.

ఇది రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని మ‌రింత‌గా చిక్కుల్లోకి నెట్ట‌వ‌చ్చు.

కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో బిల్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురైన ప‌క్షంలో ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపులు తీవ్రంగా ప్ర‌తిస్పందించే అవ‌కాశం ఉంది.

ఇది రాజ‌కీయ అంశం కావ‌డం వ‌ల్ల రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మ‌రింత క్లిష్ట‌మైన ప‌రిస్థితి నెల‌కొనాల్సి రావచ్చు.

English Summery: DOPT of Union Government declined the proposed bill with regard to the Kapu Cast reservation on employment and education in Andhra Pradesh, it is learnt. It recommended that the President of India may not give consent for the proposed bill as it is not in proper form, sources said. This development may lead the Telugu Desham Party which is in power to more problems.

 

Leave a Reply