జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్ …ట్రావెల్స్ అక్రమాలు

Former MP JC Diwakar Reddy Shows his Resentment Over Govt: Made Satirical Comments On Jagan
Share Icons:

అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు అన్నారు. దీంతో పాటు జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామని తెలిపారు.

2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్‌-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని… కానీ దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్‌-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. వీటిని స్క్రాబ్‌ కింద విక్రయించామని అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు.

నాగాలాండ్‌లో బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా మార్చారని… ఇందులో ఆరు వాహనాలు జేసీ దివాకర్‌ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్‌ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయని ప్రసాదరావు తెలిపారు. ఇందులో ఒక వాహనం జేసీ ట్రావెల్స్‌ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టర్ అయ్యిందని తెలిపారు. మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరయ్యాయని అన్నారు. దీనిపై వన్‌టౌన్‌ పీఎస్‌లో జేసీపై ఫిర్యాదు అందిందని అన్నారు.

అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో ఎవరికీ తెలియని చికెన్‌స్కాం(అధిక రేట్లకు విక్రయించి) నడిపారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మట్కా నిర్వాహకున్ని అరెస్ట్‌ చేయడానికి కడప జిల్లా నుంచి ఓ సీఐ వస్తే అతనిపై దాడి చేయించాడన్నారు. అంతేకాకుండా మట్కా నేరస్తున్ని కాపాడేందుకు ఎమ్మెల్యే హోదాలో రోడ్డుపై ధర్నా చేసిన నీచమైన వ్యక్తి జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో జేసీ సోదరులు చేసిన నేరాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.

దీన్ని తట్టుకోలేని జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. జేసీ తన అక్రమ సంపాదన కోసం అక్రమ రూట్‌లో బస్సు నడిపి గతంలో ఆత్మ డీపీడీ ప్రసాద్‌ను పొట్టనపెట్టుకున్నాడన్నారు. ఇప్పటికే జేసీ నేరచరిత్రకు సంబంధించిన రెండు భాగాలు విడుదలయ్యాయని, త్వరలో మూడో భాగం విడుదలవుతుందన్నారు.

 

Leave a Reply