ఆంధ్రాకు మరో ఆరు పెద్ద కంపెనీలు

Share Icons:

విజయవాడ, నవంబర్ 14: 

ఇప్పటికే రాష్ట్రంలో కియా మోటర్స్‌, హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌ వంటి పరిశ్రమలు రాగా తాజాగా మరో ఆరు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో రూ.4,332 కోట్ల పెట్టుబడులతో వీటిని నెలకొల్పబోతున్నారు.

మొత్తం 12,071 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. పరిశ్రమలకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలో.. జపాన్‌కు చెందిన టీహెచ్‌కే కంపెనీ చిత్తూరు జిల్లాలో రూ.802 కోట్లతో పెద్ద పెద్ద భవనాలను శుభ్రపరిచే పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. 600 మందికి ఇందులో ఉపాధి కల్పించనున్నారు.  ఇదే జిల్లాలో దుస్తుల తయారీలో పేరున్న అర్వింద్‌ కంపెనీ రూ.760 కోట్లతో కర్మాగారాన్ని ప్రారంభించనున్నది. 9,300 మందికి ఉపాధి లభిస్తుంది.

ఇక్కడే శ్రీసిటీలో ఫ్లేవర్స్‌, ఫ్రాగ్రెన్సెస్‌ ఇండియా రూ.525 కోట్ల పెట్టుబడితో ఐస్‌ క్రీమ్‌లు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే పరిమళ ద్రవ్యాలు, సుగంధాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటుచేయనున్నది. ఇందులో 450 మందికి అవకాశం లభిస్తుంది. అనంతపురం, విశాఖ జిల్లాల్లో.. అద్దాల తయారీలో ప్రపంచ స్థాయి ఉత్పాదక కంపెనీగా పేరొందిన సెయింట్‌ గొబైన్‌ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో 180 ఎకరాల్లో అద్దాల ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది.

మొత్తం 1,300 మందికి ఉపాధి లభిస్తుంది. డూవూన్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ సంయుక్తంగా రూ.210 కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసే కియా కార్ల విడిభాగాల ఉత్పత్తి కర్మాగారంలో 350 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదే జిల్లాలో డాంగ్‌-ఎ హనుంగ్‌ సంస్థ కూడా కియా కార్ల విడిభాగాల ఉత్పత్తికి మరో కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నది.

మామాట: ఇవన్నీ కార్యరూపం దాల్చేదెప్పుడో…

Leave a Reply