ఏపీలో ఎన్నికల ఖర్చెంత?  

Share Icons:

అమరావతి,ఏప్రిల్ 19,

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు తొలిదశలోనే ముగిశాయి. 79.63 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.68 శాతం ఓటింగ్ పెరిగింది. ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈవీఎంలు, రవాణాఖర్చు, ఎన్నికల సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది నిర్వహణ ఖర్చు..ఇలా అంతాకలుపుకుంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుంది. మరీ ఏపీలో ఈసారి ఎన్నికల ఖర్చు ఎంతయిందనే దానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ఏపీ ఎన్నికలకు రూ.550-600 కోట్లు ఖర్చయినట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. వీటిలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 50 శాతం కేంద్రం భరించాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చంతా భరించాలి. ఎన్నికల ఖర్చుకు సంబంధించి పూర్తిస్థాయి బిల్లులు చూపిస్తే అందులో 50శాతం డబ్బును రాష్ట్రానికి కేంద్రం అందజేస్తుంది.

ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 25 పార్లమెంటరీ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీ అసెంబ్లీకి మొత్తం 2,118 మంది పోటీ చేయగా.. లోక్‌సభకు 319 మంది పోటీపడ్డారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. విజయం తమదేనని ఇటు టీడీపీ, అటు వైసీపీ ఢంకా బజాయిస్తున్నాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ..అధికారం ఎవరిని వరిస్తుందన్నది మే 23న తేలనుంది.

మామాట: ఇదంతా ప్రజల డబ్బే కదా, మరి పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు కూడా లేదే.. 

Leave a Reply