Anchor Pradeep: అబ్బాయిగారు ఏం ఇత్తారేంటి?? అంటే 150 మిలియన్ల వ్యూస్ ఇచ్చాడు.. ప్రదీప్ ప్రభంజనం

Share Icons:
ఒక సినిమాకు హైప్ తీసుకురావడం హీరో, హీరోయిన్ల, దర్శకులకు మాత్రమే కాదు.. ఆ సినిమా నుంచి పాట జనంలోకి వెళ్లితే ఆటోమేటిక్‌గా హైప్ వస్తుందని తెలియజేసింది ఈ పాట. ‘నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నా’ అంటూ పాడిన ఈ పాట యూట్యూబ్‌లోనే కాదు ఏ ఇంట్లో.. ఏ ఫోన్‌లో చూసినా ఇదే పాట. పిల్లలు, పెద్దలు అని లేదు.. వినసొంపుగా కనులకు ఇంపుగా ఉన్న ఈ పాట టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుండటంతో ఈ పాట 150 మిలియన్ల రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఒక్క యూట్యూబ్‌లో 122 మిలియన్లు వ్యూస్ రాగా.. అన్ని డిజిటల్ వ్యూస్ కలుపుకుని 150 మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసింది ‘నీలి నీలి ఆకాశం’ పాట.

బుల్లితెరపై క్రేజీ యాంకర్‌గా పేరొందిన ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే టైటిల్ పెట్టినా.. చాలా మంది ‘నీలి నీలి ఆకాశం’ హీరో అనే అంటున్నారంటే ఈ పాట ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ స్వరాలను సమకూర్చారు. సిద్ శ్రీరామ్, సునీతలు అంతే అద్భుతంగా ఆలపించడంతో ఈ పాట టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే సంచలనంగా మారింది. చిన్న చిత్రంగా విడుదలౌతున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ పాట 150 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీలో ఉంది. ప్రదీప్, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ దగ్గర ఆర్య, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన ఈయన ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడగా.. థియేటర్స్ ఓపెన్ అయిన తొలివారంలోనే ప్రేక్షకుల్ని ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అని పలకరించబోతున్నారు యాంకర్ ప్రదీప్.