అమృతని అడ్డుకున్న మారుతీరావు బంధువులు..కడసారి చూపుకు నోచుకోకుండానే

Share Icons:

హైదరాబాద్: మిర్యాలగూడలో తండ్రి మారుతీరావును చూసేందుకు వెళ్ళిన అమృతకు చేదు అనుభవం ఎదురైంది. అయితే.. శ్మశాన వాటికలోని బంధువులు అమృతను అడ్డుకున్నారు. అమృత గో బ్యాక్ అంటూ.. నినాదాలు చేశారు. దీంతో కడసారి చూపు చూడకుండా వెనుదిరిగింది.

కాగా.. నిన్న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సూసైడ్ లెటర్ రాసి.. విషం తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తండ్రి ఆత్మహత్యపై అమృత స్పందిస్తూ.. మీడియా ద్వారానే తనకు విషయం తెలిసిందని, అంతకు మించి మరే వివరాలూ తెలియవని అన్నారు.

‘‘బహుశా పశ్చాత్తాపపడి ఉండొచ్చు. చేసినతప్పు తెలుసుకుని ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. మరే ఇతర కారణాలు ఉన్నాయో, మాకైతే ఇంకా తెలీదు. ప్రణయ్‌ని చంపేసిన తర్వాత నేను అతనితో మాట్లాడలేదు, అతడిని చూడలేదు. ఆయన ఇక్కడికి రాలేదు. చూడలేదు. అసలు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆయనతో ఎలాంటి కాంటాక్ట్ లేదు నాకు. ఆయన చనిపోయింది నిజమో కాదో కూడా మాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు ఏమీ చెప్పలేం. రేపు ఏమైనా చెప్పగలిగితే చెబుతాం’’ అన్నారు.

అయితే కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. 2018లో కిరాయి హంతకులతో కూతురు భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించారు. ప్రణయ్‌, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ది షెడ్యూల్డ్‌ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది ఉన్నత సామాజిక వర్గం. ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావే కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తూ మారుతీరావును ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, అలా చెబితే ఆస్తి మొత్తం రాసిస్తానంటూ తన తండ్రి ఒత్తిడి చేస్తున్నారని గతంలో అమృత ఆరోపించారు. ప్రణయ్ చనిపోయేప్పుడు గర్భవతిగా ఉన్న అమృత తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చారు.

 

Leave a Reply