15న పాలమూరుకు అమిత్ షా

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 7:

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపడం కోసం ఒకవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తుండగా, బీజేపీ సైతం ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం కోసం, తమ బలాన్ని గణనీయంగా పెంచుకోవడం కోసం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహరచనలో సిద్దహస్తుడిగా పేరున్న బీజీపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణలో పార్టీ ఎన్నికల వ్యూహాలను, ప్రచారాన్ని ముందుండి నడిపించడం కోసం సిద్దమవుతున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 15న మహబూబ్‌నగర్ లో ఎన్నికల శంఖారావం బహిరంగసభను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హజరుకానున్నారు. భారీ ఎత్తున జనసమీకరణ పై పార్టీ వర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. ఏర్పాట్ల పరిశీలనను పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి పర్యవేక్షించనున్నారు.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సెప్టెంబరు 10న ఏర్పాట్లను పరిశీలించడం కోసం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. జనసమీకరణ కోసం రాష్ట్ర నేతలకు అసెంబ్లీ వారిగా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఢిల్లీలో సెప్టెంబరు 8, 9 తేదీల్లో జరిగే బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ తెలంగాణ ఎన్నికల అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గ పరిధిలో జాతీయ స్థాయి నేతలతో సభలు, సమావేశాలు నిర్వహించాలని అధిష్ఠానం భావిస్తోంది.

మామాట: మరి అమిత్ షా వ్యూహాలు ఇక్కడ ఏ మేరకు ఫలిస్తాయో?

Leave a Reply