పెట్రేగిపోతున్న పాకిస్తాన్‌

Share Icons:

పెట్రేగిపోతున్న పాకిస్తాన్‌

సామాజిక అభివృద్ధి కోసం చాలా కాలంగా అందిస్తున్న ఆర్ధిక‌ సాయాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్ బ‌తిమాలే ధోర‌ణి వ్య‌క్తం చేస్తుంద‌ని బ‌హుశ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్ అంచ‌నా వేసి ఉంటారు.

అయితే అందుకు భిన్నంగా పాకిస్తాన్ అమెరికాతో పూర్తిగా తెగ‌తెంపులు చేసుకునే దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించ‌డం అమెరిక‌న్ల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించి ఉండ‌వ‌చ్చు.

అమెరికా సాయాన్ని నిలిపివేసిన ఉత్త‌ర క్ష‌ణంలోనే ఆ దేశ సైనిక స్థావ‌రాల‌ను తీసేసేందుకు, వారికి అందించే స‌హ‌కారాన్ని నిలిపి వేసేందుకు పాకిస్తాన్ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప్రారంభించింది. ఇది ఒక ర‌కంగా అమెరికాకు అవ‌మాన‌మే.

ప్ర‌పంచానికే పెద్ద‌న్న‌గా ఉన్న అమెరికాను బ‌తిమాల‌కుండా ఊరుకోవ‌డం, పైగా కయ్యానికి కాలుదువ్వ‌డం అవ‌మానం కాక మ‌రేమిటి? బ‌తిమాల‌కుండా త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో నిమ‌గ్న‌మైన పాకిస్తాన్ ను మ‌రింత‌గా క‌వ్వించేందుకు అమెరికా సిద్ధ‌ప‌డుతుండ‌టం కూడా ఇక్క‌డ గ‌మ‌నార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఇచ్చిన సాయాన్ని పాకిస్తాన్ స‌క్ర‌మంగా వినియోగించ‌నందున దాన్ని తిరిగి ఇచ్చేయాల‌నే డిమాండ్‌తో అమెరికా ముందుకు వ‌స్తున్న‌ది.

ఇప్ప‌టికే చైనాతో జ‌ట్టు క‌ట్టిన పాకిస్తాన్ ఇటు భార‌త్ పైనా అటు అమెరికా పైన కూడా తిరుగుబాటు ధోర‌ణినే ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. చైనా బేష‌ర‌తుగా పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తు ఇస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే అయినా భార‌త్‌గానీ, అమెరికా గానీ ఏం చేయ‌లేని ప‌రిస్థితే నెల‌కొని ఉంది.

ఇంత కాలం తాము ఇచ్చిన నిధుల‌ను తిరిగి ఇచ్చేయాల‌ని అమెరికా కోరితే పాకిస్తాన్ మ‌రొక అడుగు ముందుకు వేసి అమెరికాతో నేరుగా త‌ల‌ప‌డేందుకు సిద్ధం అయిపోవ‌చ్చు.

ఉగ్ర‌వాదం నిర్మూల‌న‌కు అమెరికా ఇచ్చిన సాయాన్ని పాకిస్తాన్ అందుకు వాడ‌డం లేద‌ని, అమెరికా ఇచ్చిన నిధుల‌ను పాకిస్తాన్ త‌న సైనిక అవ‌స‌రాల‌కు వినియోగించుకుంటున్న‌ద‌ని భార‌త్‌తో స‌హా అమెరికా నిఘా సంస్థ‌లు అన్నీ కూడా నెత్తి నోరు బాదుకుంటూనే ఉన్నాయి.

అయితే ఇప్ప‌టి వ‌రకూ అమెరికాను పాలించిన వారు ఇత‌ర రాజ‌కీయ కార‌ణాల‌తో పాకిస్తాన్‌కు సాయం అందిస్తూనే వ‌చ్చారు.

సాయం నిలిపేందుకు య‌త్నించిన ఒబామా

భార‌త్‌తో స‌న్నిహితంగా ఉన్న బ‌రాక్ ఒబామా అమెరికా అధ్య‌క్షుడుగా ఉన్న కాలంలో పాకిస్తాన్‌కు సాయాన్ని నిలిపి వేసేందుకు ప్ర‌య‌త్నించారు కానీ అమెరికాలోనే ఏకాభిప్రాయం సాధించ‌లేక‌పోయారు.

దాంతో పాకిస్తాన్‌కు ఆర్ధిక సాయం అందుతూనే వ‌చ్చింది. పూర్తిగా నిలిపివేసే వీలు కుద‌ర‌నందున ఒబామా పాకిస్తాన్‌కు ఇచ్చే సాయంలో కొద్ది మేర‌కు కోత విధించారు.

ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి పాకిస్తాన్‌పై ఏ విధంగా ఆంక్ష‌లు విధించాలా అనే చూస్తూ వ‌చ్చారు. ఆయ‌న త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో కూడా పాకిస్తాన్ ఇత‌ర ముస్లిం దేశాల‌కు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తాన‌ని కూడా చెప్పారు.

ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో చెప్పిన విధంగా ఒక్కో చ‌ర్య తీసుకుంటూ వ‌స్తున్న ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్‌కు ఇచ్చే ఆర్ధిక సాయంపై తుది నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలో వ‌స్తున్న మార్పు గ‌మ‌నిస్తున్న పాకిస్తాన్ గ‌త రెండు మూడేళ్లుగా చైనాకు మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యేందుకు అన్నిచ‌ర్య‌లు తీసుకుంది.

అమెరికా సాయం రాక‌పోయినా చైనా ద‌న్నుతో భార‌త్‌పైకి దూకేందుకు అస్త్రాల‌ను కూడా పాకిస్తాన్ సిద్ధం చేసుకుంటున్న‌ది. ఇలాగ‌ని ముస్లింలు చైనా ప‌ట్ల ఆక‌ర్షితులు కావ‌డం లేదు.

పాకిస్తాన్‌లోని ముస్లింలు చైనాపై త‌మ నిరాశ‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. చైనా, పాకిస్తాన్ స‌రిహ‌ద్దులలో ఇరు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

Leave a Reply