50వ రోజుకు అమరావతి ఉద్యమం..రైతులకు జగన్ ఏం హామీ ఇచ్చారు?

amaravati farmers protest
Share Icons:

అమరావతి: మూడు రాజధానులు వద్దు…అమరావతినే ముద్దు అంటూ రాజధాని 29 గ్రామాలు చేస్తున్న ఉద్యమం నేటితో 50 రోజులకు చేరుకుంది. 50 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సత్యాగ్రహ దీక్షలను ముగించనున్నారు. గాంధీ వర్ధంతి రోజున ఈ సత్యాగ్రహ దీక్షలు మొదలు పెట్టిన 50 మంది రైతులు నేడు సత్యాగ్రహ దీక్షలను విరమించనున్నారు . అలాగే కుల వృత్తులు చేస్తూ వినూత్న నిరసన చేపట్టనున్నట్టు జేఏసీ నేతలు కూడా నిర్ణయించారు.

ఇక మరోపక్కన వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 50 వ రోజుకు చేరిన సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు సెంటర్లలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి వారిని పరామర్శించనున్నట్లు, వారికి సంఘీభావం తెలపనున్నట్టు టీడీపీ కార్యాలయం వెల్లడించింది.

మరోవైపు రాజధాని ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కొందరు రైతులను సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్ళారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి. ముఖ్యమంత్రి జగన్ కు ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను విన్నవించారు . మూడు రాజధానులవల్ల వచ్చే ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారని తెలుస్తుంది.

అటు రాజధాని అమరావతి కోసం ఢిల్లీ వెళ్ళిన రాజధాని రైతులు కేంద్ర పెద్దలను కలిశారు. మొదట ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన రైతులు రాజధాని సమస్యలను వివరించారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసుల దాడులను ఉపరాష్ట్రపతికి వివరించారు. రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Leave a Reply