రాజధానిపై ఫిర్యాదుల వెల్లువ..గవర్నర్ దగ్గరకు జే‌ఏ‌సి

amaravati farmers protest
Share Icons:

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నెల రోజుల నుంచి ఆ ప్రాంత జనాలు, రైతులు, జే‌ఏ‌సి నేతలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడు రాజధానులు వద్దంటూ అమరావతి గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనలు నేటితో 31వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తుళ్లూరులో రైతులు మహాధర్నాలు నిర్వహించనున్నారు. అటు వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే దీక్షలు 31వ రోజు కొనసాగుతున్నాయి. మంగళగిరి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బైక్ ర్యాలీలో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొననున్నారు.

అటు ఏపీ రాజధాని అమరావతి కోసం రైతుల ఫిర్యాదుల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. రాజధానికి సంబంధించి హైపవర్‌ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రులు కోరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 3,100మంది రైతులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు సీఆర్డీఏ ఫిర్యాదులు స్వీకరించనుంది.

కాగా హైపవర్‌ కమిటీ శుక్రవారం మరోసారి భేటీ కానుంది. రైతుల సమస్యలు, రాజధాని అంశంపై చర్చించి ఓ నిర్ణాయానికి వచ్చే అవకాశముంది. ఇప్పటికే హైపవర్‌ కమిటీ మూడుసార్లు సమావేశం అయింది. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలను హైపవర్‌ కమిటీ అధ్యయనం చేసింది. కాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యంలోని హైవర్‌ కమిటీ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కానుంది.

ఇదిలా ఉంటే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో అమరావతి జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం సమావేశంకానున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ అమలుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన పరిణామాలను…రైతు ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు.

 

Leave a Reply