స్వాతంత్ర్య చరిత్రలో “అల్లూరి” ఒక మహోజ్వల శక్తి

Share Icons:

స్వాతంత్ర్య చరిత్రలో “అల్లూరి” ఒక మహోజ్వల శక్తి

 భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఈయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కోసమే ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు “శ్రీరామరాజు”. ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా “శ్రీరామరాజు”, “అల్లూరి శ్రీరామరాజు” అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి “సీతారామరాజు” అనే పేరు స్థిరపడింది.

తెల్లజాతి దోపిడీని ఎదిరించిన సీతారామ రాజు దేశభక్తి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకోద్యమంలో భాగంగా మన్యం పోరాటం సుమారు రెండేళ్లపాటు సాగింది. కాలం గడుస్తున్న కొలదీ, దెబ్బలు తింటున్న కొలదీ బ్రిటిష్ సామ్రాజ్య వాదులు తమ సైనికశక్తిని సమీకరించుకొని గిరిజన ప్రాంతాలపై కేంద్రీకరించి దాడి చేయడం అధికమైంది. సామ్రాజ్య సైనిక బలగాల ముందు సాంఘికంగా, ఆర్థికంగా, వెనుకబడిన గిరిజన రైతాంగం జనసాంద్రత కలిగిన మైదాన ప్రాంతాల సహకారం లేకుండా ఎక్కువ కాలం తమ పోరాటాన్ని కొనసాగించలేకపోయింది. గెరిల్లా యుద్ధానికి అనువైన కొండలు, అరణ్యాలు తోడుగా ఉన్నాయి. గిరిజన సమాజం పూర్తి తోడ్పాటునందించింది. ఈ అనుకూలమైన అంశాలను అతి చాకచక్యంగా వినియోగించుకొని సీతారామరాజు అద్భుతమైన విజయాలు సాధించగలిగాడు. ఈ ఉజ్జ్వల పోరాటానికి రావాల్సిన ప్రాచుర్యం లభించలేదు. దేశంలోనూ, రాష్టరంలోను కూడా సామ్రాజ్య వాదుల దోపిడీని సహించలేక చిన్నవి, పెద్దవి అనేక పోరాటాలు, తిరుగుబాట్లు జరిగాయి. నాటి స్వాతంత్య్ర వీరులు ధన మాన ప్రాణాలు సమస్తం ఒడ్డి అసమాన తెగువ, సాహసాలను ప్రదర్శించారు. తమ త్యాగాల ద్వారా ప్రజలలో దేశభక్తిని పురిగొల్పారు. విఫలమైన వీరోచిత పోరాటాలు తాత్కాలిక వైఫల్యాలకు గురైనప్పటికీ అంతిమ పోరాటానికి దోహదం చేశాయి. కోటాను కోట్ల జనంలో బహు కొద్దిమంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచఒలో ప్రతి జాతిలో ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులలో అల్లూరి అగ్రగణ్యుడు.

ఇరవై ఏడేళ్ళంటే ముక్కుపచ్చలారని వయసు. చదువు పూర్తిచేసుకొని, అప్పుడప్పుడే వ్యాపారమో, ఉద్యోగమో మరేదైనా సంపాదనామార్గమో ఎంచుకొని విజయాల బాటన నడక మొదలుపెట్టే వయసు. అల్లూరి సీతారామరాజు ఆ సరికే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించగల ఉద్యమాన్ని నడిపి, దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర్య స్పూర్తిని నింపి, నిష్క్రమించాడు. అల్లూరి ఒక మహోజ్వల శక్తి. సీతారామరాజు నమ్మిన సిద్దాంతం ప్రాణాలర్పించైన పోరాటం ద్వారానే స్వతంత్రం తీసుకురావలనుకున్నడు. చివరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్ళను ఎదిరించాలని నిర్ణయించుకొన్నాడు. గాంధీజీలా అహింసామార్గంలో కాదు. హింసామార్గంలో. అక్కడే ఆయనపై రాజకీయ నీడలు కమ్ముకున్నాయి.

మన్యప్రాంతానికి వెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతత్ర్యం ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులులాంటి ఆయుధాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకీలనీ, మందుగుండు సామాగ్రినీ స్వాధీనం చేసుకోవడానికి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుధాలనీ, ప్రక్క రాష్ట్రాలనుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించ వలసి వచ్చింది. 1922 నుంచి 1923 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేశాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవపూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు.

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష.

1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 1923 ఏప్రిల్ 21 ఆంధ్రపత్రిక ప్రచురించింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై 4,000 రూపాయలు జరిమానా, అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి “నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది” అని కలెక్టరుకు రాజు “మిరపకాయ టపా” పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. 1923 మే 7  బ్రిటిష్ తూటాలకు ఆయన బలయ్యాడు. (ఈ విశేషాలు 19-4-1923 తేదీ హిందూ పత్రిక ప్రచురించింది..)

సీతారామరాజు మరణించినా అతను రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదు. వీరుడు మరణించడు. విప్లవానికి పరాజయంలేదు. వీరుడు చిందించిన వేడి రక్తం కలకాలం ఉడుకురక్తంగా ప్రవహిస్తునే ఉటుంది.

-భరద్వాజ

Leave a Reply