Allu Arjun: మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆయనే.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

Share Icons:
తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ప్రస్థానం దివంగత అల్లు రామలింగయ్యది. దాదాపు పన్నెండు వందల సినిమాలలో నటించిన ఘనత ఆయన సొంతం. ఆ రోజుల్లో వెండితెరపై నవ్వులు పూయించడంలో అల్లు రామలింగయ్యను మించిన యాక్టర్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రొటీన్ కామెడీని తన మార్క్ హాస్యం జోడిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో కితకితలు పెట్టించి నవ్వించిన ఆయన 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు.

1929 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించిన 2004 సంవత్సరంలో సరిగ్గా ఇదే తేదీ (జులై 31వ తేదీ) ఈ లోకం విడిచి వెళ్లారు. అయితే ఈ రోజు సందర్భంగా తన తాతయ్యను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు స్టైలిష్ స్టార్ . ”తాతయ్య మమ్మల్ని వదిలివెళ్లిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి అప్పటి కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చేకొద్దీ ఆయన పడిన కష్టాలు, కృషి, పట్టుదల ప్రయాణం ఏంటనే విషయం అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం” అని పేర్కొన్నారు అల్లు అర్జున్.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.