మామాట లో మీమాట పోల్ నెం.11 – ఒకే వేదిక మీదికి రండీ… మీ బండారం మేం తేలుస్తాం..

Share Icons:

ఒకే వేదిక మీదికి రండీ… మీ బండారం మేం తేలుస్తాం..

“హోదా కోసం… మేము పోరాటం చేస్తున్నామంటే… మేము పోరాటం చేస్తున్నాం…” అంటూ పార్టీలన్నీ బ్యానర్లు చించుకుంటున్నాయి.

[yop_poll id=”20″]

ఆంధ్రప్రదేశ్ వీధుల్లో పోతురాజుల్లా ఎక్కడ లేని వేషాలన్నీ వేసేస్తున్నారు. అబ్బో! చూస్తుంటే ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ భక్తులు మరొక్కరు ఉండరేమో… అనిపిస్తుంది. ఒకరిది ధర్మపోరాటం సభ! మరొకరిది వంచన వ్యతిరేక దీక్ష! ఎవరు ఏ సభ పెట్టినా వేలు లక్షల్లోనే జనం. ఆహా…హా.. జనంలో కూడా ఎంత చైతన్యం తీసుకువచ్చారు..?. ఓహో…హో.. హోదా పట్ల ఎంత నిబద్ధత. ఎంత చిత్తసుద్ధి. ఇంత చైతన్యం ఉన్నా కేంద్రంలో కదలికలేదు ఇదేం ప్రభుత్వం అనుకుంటారు. వారి ధాటిని చూస్తే. కాస్త బుర్రకు పదును పెట్టే రాజకీయ పరిశీలకులకు విషయం మాత్రం మరోలా కనిపిస్తోంది. అనిపిస్తోంది. ఇంత చేసినా కేంద్రం కదలి రావడం లేదెందుకు? అనే ప్రశ్న వారి బుర్రలను పదే పదే తొలిచేస్తోంది. ఇంకాస్త లోతుకెళ్లితే, ఎక్కడ లోపం..? ఎవరిది పాపం.? ఎవరు దోషులు? అనే ప్రశ్నలతో మస్తిష్కాలను వేడెక్కిస్తాయి. ఎందుకిలా… అంటే అన్ని పార్టీలవైపు ఒక్కసారి పారచూడాలి. అప్పుడే అర్థమవుతాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన తలుపులు వేసుకుని చేసినా, తలుపులు తెరిచి చేసినా ఆ సందర్భంగా కొన్ని హామీలు, చట్టాలు రూపొందాయి. అయితే హామీలు ఇచ్చింది, చట్టాలు చేసింది ఒక పార్టీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చింది మరో పార్టీ ప్రభుత్వం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ ఏర్పాటు చేసినా ప్రభుత్వం మాత్రం ఒక్కటే. అదే మన రాజ్యాంగ స్పూర్తి. కానీ, ఇక్కడో సూక్ష్మం ఉంది. ఆ ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ రక్తం వేరే ఉంటుంది. ఇక్కడ తేడా వస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దానికి ఎవరెవరో ఎన్నిరకాలు కావాలో అన్ని రకాల సహకరించారు. ఇది వేరే అంశం. ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుతం ఉన్న బీజేపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి ఒక్కో పార్టీ ఒక్కో వేషం వేస్తోంది.

ధర్మపోరాటం దేని కోసం…?

2014 ఎన్నికలలో తెదేపా, భాజపాలు ఆంధ్రప్రదేశ్‌లో జంట పక్షుల్లా చట్టపట్టాలేసుకుని నాలుగేళ్ళ పాటు కాలం గడిపారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్‌సీపీ, వామపక్షాలు, మరికొన్ని పోరాట సంఘాలు కలిపి హోదా ఎప్పుడిస్తారు? ఎంతలోపు ఇస్తారనే డిమాండ్‌ను ముందుకు తీసుకు వచ్చారు. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు కలిసి హోదా అనేది వాళ్ళ ఇంటి వ్యవహారం తరహాలో ఓ ఒప్పందానికి వచ్చారు. అదే తడువుగా కేంద్రంలో హోదా బదులు ప్యాకేజీ అన్నారు. అది అదునుగా చంద్రబాబు ప్యాకేజీని నెత్తిన పెట్టుకుని కూరగాయలో… కూరగాయలు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో అమ్మి ఓట్లుగా సొమ్ము చేసుకోవాలని చూశాడు. పైగా అరుణ్ జైట్లీ, మోడీలకు శాసనసభ సాక్షిగా కృతజ్ఞతా తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడిని తన భుజాలకు ఎత్తుకున్నంత పని చేశారు. ఎదురు ప్రశ్నించిన ప్రజాసంఘాలకు, వామపక్షాలకు కృష్ణ జన్మస్థానాలను చూపించారు. దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈడ్చి ఆసుపత్రిలో పారేశారు. అంతేనా… ప్రత్యేక హోదా సంజీవిని కాదన్నారు. ప్రత్యేక హోదా వద్దు… ప్యాకేజే ముద్దని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు నోటికి మైకులు కట్టుకుని వాడవాడా, మూలమూల తిరిగి చెప్పారు. ఎంత చెప్పినా వారి కూరగాయల వ్యాపారం(ప్యాకేజీ) సాగలేదు. జనం మౌనంగానే ఛీ కొట్టారు.

ఇంతలో డీమోనిటైజేషన్, జీఎస్టీలతో జనానికి ఎన్ని రకాల వాతలు పెట్టాలో అన్ని రకాల వాతలూ పెట్టింది కేంద్రం. ఇక ఈ పెద్దమనిషితో ఉంటే ఉన్నది కాస్త ఊడుతుందనే భయం చంద్రబాబులో చొరబడింది. జనం నాడిని, వేడిని గ్రహించి విధిలేని పరిస్థితిలో భాజపాతో విడాకులు తీసుకున్నారు. వెనువెంటనే చంద్రబాబు ప్యాకేజీకి రాంరాం అంటూ యూటర్న్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి హోదా అనే పదాన్ని తన సొంతం చేసుకోవడానికి ఎన్ని వేషాలు వెయ్యాలో అన్ని వేషాలు వేస్తున్నారు. భాజపా తమను మోసం చేసిందని, ధర్మపోరాట దీక్ష, ధర్మ పోరాటం వంటి కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాడు. హోదాను ఊదరగొడుతున్నాడు. ఇది ఈయన కథ ఇక. దీనికి భాజపా ఏం చేయబోతోందో వేచి చూడాలి..

బాబూ! మోసం చేసింది నువ్వా.. మేమా?

BJP MPs didn't respond to modi's speech in parliamentవేంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో ప్రత్యేక హోదాపై వేసిన ఒట్టును గట్టున పెట్టిన తెలుగుదేశం, బీజేపీలు ఆయన సాక్ష్యంతో ఏమాత్రం సంబంధం లేకుండా లోపల లోపలే ప్యాకేజీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తరువాత బాబు యూటర్న్ తీసుకున్నాడు. కానీ, నిందమాత్రం బీజేపీ మీద వేయడంతో ఆ పార్టీ చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. రాజధాని కోసం తామిచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తోంది. హోదా వద్దని చెప్పింది నువ్వు కాదా? ఈ పాపంలో నీకు భాగం లేదా? అని ప్రశ్నిస్తోంది. కేంద్రం నుంచి ఇన్ని లక్షల కోట్లు వచ్చాయి ఆహా! ఇంద్రలోకాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తానని చెప్పింది నీవు కాదా? అని మండిపడిపోతోంది. పోలవరానికి నిధులిస్తే లెక్కలు చెప్పావా? అని వారు నిలదీస్తున్నారు. ఇలా ఒకటేంటి చాలా ప్రశ్నలే భాజపా వారు చంద్రబాబు మీద సంధిస్తున్నారు. అయితే, చంద్రబాబు ఒప్పుకుంటే హోల్ ఆంధ్రప్రదేశ్ అంతా ఒప్పుకున్నట్లే అనుకుని హోదాను ప్యాకేజీగా మార్చిన ఘనత బీజేపీది. వారు కూడా చంద్రబాబుతో కలసి ఆంధ్రప్రదేశ్ జనాన్ని వంచన చేయాలని చూసిన వారే. ఆడిన మాట నుంచి తప్పించుకోవాలని చూసిన వారే… ఇక ప్రతిపక్ష పార్టీ ఎలా ఉందో చూద్దాం.

‘వంచన వ్యతిరేక దీక్ష’… మోడీ వ్యతిరేక దీక్ష కాదా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపి, వామపక్షాలు మొదట నుంచి ఒకే స్టాండు మీదున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి ప్రత్యేకహోదా వలన కలిగే లాభాలను కూడా చెప్పాడు. అవి లేకపోతే వచ్చే నష్టాలను కూడా విడమరిచి చెబుతూ వచ్చాడు. దీక్షలు, ధర్నాలు చేశాడు. తరువాత వైకాపా ఎం.పి.లు పార్లమెంటు వేదికగా పోరాటం సాగించారు. అంతటితో ఆగక ఎంపీలు రాజీనామాలు చేసి పోరాటంలో తామే ముందున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా పోరాటంలో చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తోంది. నిన్నటి దాకా అంతటి పోరాటం చేసిన వైసీపీ నేడు ‘వంచన వ్యతిరేక దీక్ష’ అనే పేరుతో హోదాను అడ్డుపెట్టుకుని చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి? నెరవేర్చినవెన్ని? నేరవేర్చాల్సినవెన్ని? కేంద్రం చేసిన మోసం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. మోడీకి నొప్పి తగలకుండా చేసే పోరాటంపై పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి.

చోటేభాయ్ అండ్ గ్యాంగ్ ఆటలేంటి?

pawan kalyanమరోవర్గం కూడా హోదా కోసం పోరాటం చేస్తోంది. అదే జనసేన పార్టీ, వామపక్షాలు. వీరిలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు హోదా కోసం ఇంత చేస్తాను. అంత చేస్తానని ఊదరగొట్టిన వాడే. సీజనల్ పొలిటీషియన్ గా ముద్రపడ్డా ఫాలోయింగు బాగానే ఉంది. ఈయన చేసే పోరాటంలో ఆర్భాటం మినహా మరేమి కనిపించలేదనిపిస్తుంది. హోదా కోసం ఒక రోజు రోడ్లెక్కడం ఆపై హైదరాబాద్ లో కూర్చుని ట్వీట్లు చేసుకుంటూ ఉండడమే రాజకీయంగా భావిస్తున్నారు చోటేభాయ్… హోదా రాకపోతే కేంద్రాన్ని కడిగేస్తాను. దక్షిణ భారతదేశంపై ఉత్తరాది నాయకులు అహంకారాన్ని చూపిస్తున్నారంటూ హూంకరించి పవన్ కళ్యాణ్ ఆపై కనీసం కేంద్రంపై సణుగుడు కూడా లేకుండా ఉన్నారు. కానీ, ప్రత్యేక హోదా కోసం అప్పుడప్పుడు రోడ్డెక్కుతుంటారు. ఇక అంత పెద్ద చరిత్ర కలిగిన వామపక్షాలు కూడా పవన్ తోక పట్టుకుని వీధి ప్రదర్శనలిస్తున్నాయి. ఇది ఈ పార్టీల వ్యవహారం.

ఒక వేదికపైకెందుకురారు?

ఈ పార్టీలన్ని పోరాటం చేసేది దేని కోసం? ప్రత్యేక హోదా కోసం… రాష్ట్రాభివృద్ధి కోసం అని చెబుతుంటాయి. ఎక్కడా వారి మాటల్లో చిత్తశుద్ధి ఇసుమంత కూడా కనిపించదు. వినిపించదు. వీరిని ఒక వేదిక మీదికి ఈడ్చి బండారం బయటపెట్టే నాథుడెవ్వడు.. అప్పుడే వీరి అసలు రంగలు బయట పడతాయి. వీరికి హోదా ముఖ్యమా? రాజకీయ లబ్ధి లక్ష్యమా? అనే అంశం పటాపంచలు అవుతుంది.

మామాట : దురదృష్టం ఆ పని చేయాల్సిన మీడియా కూడా అలాగే అంటకాగుతోంది.

2 Comments on “మామాట లో మీమాట పోల్ నెం.11 – ఒకే వేదిక మీదికి రండీ… మీ బండారం మేం తేలుస్తాం..”

Leave a Reply