డీఎంకేలో చీలిక తప్పదా?

alagiri-challenges-stalin-claim-for-dmk-leadership
Share Icons:

చెన్నై, 13 ఆగష్టు:

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న ఎంకే స్టాలిన్‌కి అధ్యక్ష పీఠం అప్పగించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతుంటే..మరోవైపు నాలుగేళ్ల క్రితం పార్టీ నుంచి తొలగించబడిన కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి సైతం.. తాను కూడా అధ్యక్ష పదవికి అర్హుడేనని ప్రకటించుకుంటున్నారు.

ఈరోజు మేరినా బీచ్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆళగిరి మీడియాతో మాట్లాడుతూ… తమ తండ్రి మద్దతుదారులందరూ తన వెంటే ఉన్నారని, పార్టీలో కీలక పాత్ర పోషించాలని తనను తమిళ ప్రజలు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దీంతో అందరూ ఊహించినట్లుగానే కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పార్టీలో చీలికలు వచ్చేలా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే డీఎంకేలో కుటుంబ తగాదాలకు చోటివ్వకుండా ఉండేందుకు పలువురు సీనియర్లు రంగంలోకి దిగి ఆళగిరిని బుజ్జగించే పనిలో పడ్డారు.

ఆళగిరిని పూర్తిస్థాయి చర్చలు జరిపి, ఆయనతో ఒక అంగీకారం కుదిరిన తర్వాతే డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ను ప్రకటించాలని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో 14న జరిగే డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌ను డీఎంకే అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని వాయిదా వేసి కేవలం కరుణానిధి మృతికి సంతాపం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో మరోసారి సమావేశమై డీఎంకే అధ్యక్షుణ్ని ప్రకటించే అవకాశం ఉంది.

మామాట: ఏది ఏమైనా అధ్యక్ష పదవి స్టాలిన్‌నే వరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply