ఏప్రిల్ నుంచి రన్నింగ్‌లోకి కర్నూలు ఎయిర్ పోర్టు

Share Icons:

కర్నూలు, జనవరి 2: 

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జనవరి 7 నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జనవరి 7న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది. ఇప్పటికే పుట్టపర్తి, రేణిగుంట, కడపలో విమానాశ్రయాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ కేంద్రంగా ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలు రావాలంటే రవాణా మెరుగుపడాలని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి కేటాయించింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

దేశీయ విమానసేవల్లో భాగంగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్త్నె, బెంగళూరుకు సర్వీసులు తిరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత ఓర్వకల్లు నుంచి ఏప్రిల్‌ నెలలో, విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి చంద్రబాబు జూన్ 2017లో శంకుస్థాపన చేశారు.

ఈ విమానాశ్రయంతో కర్నూలు జిల్లా నుంచి వివిధ నగరాలకు విమానం ద్వారా వెళ్లే వెసులుబాటు ఉంటుందన్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తోన్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగంలో ఎనిమిది విమానాలను నిలుపుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరో విభాగంలో మూడు విమానాలు, ఇంకో విభాగంలో మరమ్మతులకు గురైన విమానాలు ఆపేందుకు అవకాశం ఉంటుంది. విమాన రాకపోకలు పెరిగాక మరో విభాగం ఏర్పాటు చేయనున్నారు.

మామాట: మొత్తానికి రాయలసీమలో నాలుగు ఎయిర్‌పోర్టులు అయ్యాయి.

Leave a Reply