ఆ టీడీపీ ఎమ్మెల్యే గోడ దూకేయడం ఖాయమేనట!రాజీనామా?

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి:

ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీని ముఖ్య నేతలంతా వీడుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా మరికొందరు వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా గోడ దూకేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. గొట్టిపాటి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒక నేతగా మెలిగారు.

అయితే టీడీపీ ఆపరేషన్ లో భాగంగా ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇక మొన్న ఎన్నికల్లో అద్దంకి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీడీపీ అధికారం కోల్పోయింది. ఘోరంగా 23 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో గొట్టిపాటి టీడీపీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరైన సైలెంట్ గా ఉంటున్నారు. ఇక అసెంబ్లీలో అయితే పెద్దగా కనిపించడం లేదు.

ఇదే సమయంలో ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరిన కీలక నేతలు ప్రకాశం జిల్లా నుండి యాక్టివ్ గా ఉండి.. సొంత బలంతో గెలిచే సత్తా ఉన్న గొట్టిపాటి రవిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, రవి మాత్రం వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. బీజేపీకి ఏపీలో అంత ఆదరణ లేదని..ఇప్పట్లో సాధ్యం కాదనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో ఉండలేని పరిస్థితుల్లో ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు మధ్య వర్తులు వైసీపీలో జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలతో రవి తిరిగి వైసీపీలోకి తీసుకొనే అంశం పైన చర్చించినట్లు సమాచారం.

అటు రవి అనుచరులు సైతం పార్టీ మారాలనుకుంటే తిరిగి వైపీపీలోకి వెళ్లాలని సూచించినట్లు చెబుతున్నారు. అయితే, వైసీపీలోకి రావాలంటే ఇప్పటికే జగన్ తన విధానం స్పష్టం చేసారు. ఎమ్మెల్యే ఉన్న వారు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీ లోకి రావాలని స్పష్టం చేసారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యేకు సైతం వైసీపీ నేతలు అదే విషయాన్ని స్పష్టం చేయగా..ఆయన సిద్దమని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, ఆ నేతకు మాత్రం తిరిగి ఎమ్మెల్యేగా కాకుండా..ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇక, రవి తాను వైసీపీలో చేరాలని నిర్ణయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజానామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఇక రవి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా రాజీనామా చేసి వస్తే మళ్ళీ వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలవచ్చని గొట్టిపాటి యోచన. మరి చూడాలి గొట్టిపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Leave a Reply