రగులుతున్న నల్లమల: యురేనియం తవ్వకాలపై సెలబ్రెటీల ట్వీట్లు

Actor Vijay Deverakonda joins chorus to 'Save Nallamala forest' opposing uranium mining
Share Icons:

హైదరాబాద్: నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంటుందని సెలబ్రెటీలు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరి కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యురేనియం తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాలని సందర్శించి..దాని వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని, మన రాష్ట్రానికి ఊపిరి లాంటి నల్లమలను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ రేవంత్ ఈ పిలుపునిచ్చారు.

ఇక తాజాగా పవన్ కూడా దీనిపై ఓ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతు కొనసాగుతుందని ట్విట్టర్‌లో తెలిపారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా… యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా.. అనేది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోంచించాలని ఆయన కోరారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలకూ ముప్పు తప్పదని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. యురేనియం తవ్వకాలపై త్వరలోనే రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు.

అటు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను సినీనటుడు విజయ్‌ దేవరకొండ తప్పుబట్టారు. తవ్వకాల వల్ల 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనమయ్యే ప్రమాదముందన్నారు. ‘సేవ్‌ నల్లమల’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ‘‘మనం చెరువులను నాశనం చేసుకున్నాం. సహజ వనరులు దెబ్బతినడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టిని చూశాం. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. అన్నిచోట్లా మనం పీల్చే గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇప్పుడు పచ్చని నల్లమల అడవులపైనా మన కన్ను పడింది. యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చు.. కానీ, అడవులను కొనగలమా?’’ అని విజయ్‌ ట్వీట్‌ చేశారు.

అలాగే నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతపై అనసూయ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం నల్లమల అడవులను నాశనం చేయవద్దని ఆమె విన్నవించింది. స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపేస్తే… భవిష్యత్తులో పీల్చడానికి గాలే ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యరేనియం తవ్వకాలను ఎలా అనుమతిస్తారు సార్? ఆలోచించడానికే భయం వేస్తోందని వ్యాఖ్యానించింది

 

Leave a Reply