బీజేపీలో చేరిన సైనా…క్రీడాభివృద్ధి కోసమే…

Ace badminton player Saina Nehwal joins BJP
Share Icons:

ఢిల్లీ: ఊహించని విధంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఆమె తమ పార్టీలోకి రావడం శుభసూచకమని అరుణ్ సింగ్ అన్నారు. ఆమెకు బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్సూ నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు. అనంతరం తన సోదరితో కలిసి సైనా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాను కలిశారు.  అనంతరం సైనా మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది. దేశం కోసం పని చేసే పార్టీలో చేరాను. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరాను. దేశంలో క్రీడాభివృద్ధికి మోదీ సర్కారు ఎంతో చేసింది. కష్టపడి సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమెకు పలువురు బీజేపీ జాతీయ నేతలు అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉంటే గతంలో సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని పలుసార్లు కలిశారు. ప్రధానికి బ్యాడ్మింటన్ బ్యాట్ కూడా బహుమతిగా ఇచ్చారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సైనానెహ్వాల్ బీజేపీలో చేరడం విశేషం. కాగా, హర్యానా రాష్ట్రంలో జన్మించిన సైనా దేశంలోనే విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు. హైదరాబాద్ నగరంలో స్థిరపడిన సైనా ఇక్కడి గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ గేమ్స్ లలో సైనా పతకాలు సాధించారు. 2015వ సంవత్సరంలో ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంకింగ్ మహిళా షట్లరుగా నిలిచారు. ప్రస్థుతం సైనా వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో 9వస్థానంలో ఉన్నారు. సైనా మొత్తం 24 ప్రధాన అంతర్జాతీయ టైటిళ్లు సాధించారు. 2018లో నెహ్వాల్ తోటి క్రీడాకారుడైన హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్‌ను వివాహమాడారు.

 

Leave a Reply