నిలువెత్తు కలానికి నీరాజనం:  అక్షర సేనాని ఎబికె 

Share Icons:

నిలువెత్తు కలానికి నీరాజనం : అక్షర సేనాని ఎబికె 

తెలుగు నేలపై దశాబ్దాలుగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని భ్రమపడ్డాడు పాపం. ఆయన “జర్నలిస్టులను – ఎడిటర్లను” తయారు చేద్దామనే తపన పడ్డాడు. కొందరు సంపాదకులయ్యారు, ఇంకొందరు కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయన కూడా…. ఎందుకంటే ఆయన రాజీపడడు. పడి ఉంటే ఒకే పత్రికలో దర్జాగా వెలుగుతూ ఉండేవాడు. లక్షల నజరానాకు అమ్ముడు పోయి ఉండేవాడు. ఆయనే అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్‌. పూర్తి పేరు కంటే ఎ బి కె ప్రసాద్.. అనో ఎ బి కె అంటేనో పాఠకలోకానికి ఆయన చిరపరిచితం.

ఆగస్ట్ నెలకు చరిత్రలో ప్రాముఖ్యం ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్ర్య సిద్ధి ఈ నెలలోనే.. ఆయన పుట్టింది కూడా ఈనెల మొదటి రోజునే!  ఆగస్టు 1, 1935 న  కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టారు. ఆయన సొంతూరు దగ్గరలోని ఉప్పులూరు. అమ్మ చంద్రావతమ్మ, నాన్న బుచ్చి వీరయ్య.  కృష్ణా జిల్లా పునాదిపాడులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై కొద్దికాలానికే బయటికొచ్చేశారు.

నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’పత్రికకు రిపోర్ట్ చేసేవారు. అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి తనకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరారు. తొలి ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌. ఆంధ్రపత్రిక తప్ప తెలుగులో అన్ని ప్రధాన పత్రికలకూ పనిచేశారు. పక్ష పత్రికలు, మాస పత్రికలు, చివరకు చానళ్ళూ కూడా వదలలేదు.

కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారు. ‘జనశక్తి’ సంపాదకుడిగా అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకెళ్లారు. ఈనాడు, ఉదయం, వార్త (విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ఆయన ప్రారంభ సంపాదకుడు కూడా. కొత్తగా పత్రిక పెట్టే వారికి ఆయన సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీపడి ఉద్యోగం చేయడం ఆయనకిష్టం లేదు. రాజీపడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవారు కాదేమో.

తెలుగునేలపై ఒక కొత్త పత్రిక రావాలంటే ఏబికే మనసులో ఆలోచన పురుడు పోసుకోవాలి. ఆస్పత్రులు, డాక్టర్లు, కాంపౌండర్లు, మంత్రసానులు, మందులు, శస్త్రచికిత్స సామగ్రి.. ఇలా అన్నీ ఆయన ఎంపికే.. మంచి పనిమంతుడు అని తలచి బృందంలో కలుపుకుని.. నిఖార్సయిన జర్నలిస్టని నమ్మకం పెంచుకుని బాధ్యత అప్పగిస్తాడు. తాను పుస్తకాల్లో.. చదువులో… రాతల్లో.. అధ్యయనాల్లో మునిగిపోతాడు. అందరినీ నమ్మేస్తాడు. ఇక తన ప్రపంచంలో మునిగిపోతాడు. యాజమాన్యంతో రాజీపడడు, రాజకీయంతో రాజీపడడు. తనతో తనే రాజీపడడు.. రోజులు, నెలలు.. మహ అయితే మూడు, నాలుగేళ్ళు సాఫీగా సాగిపోతాయి.. కొన్నేళ్ళకు నిజంగానే మునిగిపోతాడు. ఆయనతో ఇంకొందరు కూడా.. ఆయన పేరే ఏ పత్రికకైనా వజ్రకవచం. ఆ కవచ కుండలాలను కూడా ఇచ్చేసి బయటకి పోతాడావ్యక్తి.

ఈనాడులో, ఆంధ్రప్రభలో, ఉదయంలో, వార్తలో, ఆంధ్రభూమిలో… ఎందరో ఆయన్ను ఆశ్రయించి చేరారు. ఆయన అందలం ఎక్కించిన వాళ్లందరూ ఆయన్ను నెట్టేసారు. ఆయన సమైక్య వాది. ప్రజల మనిషి. కులాలకు, పార్టీలకు అతీతుడు. ఏకొత్త మాధ్యమం మొదలవ్వాలన్నా ఏబికె చేయి పడాల్సిందే.. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు ..అన్నీ మూసలోనుంచి బయటపడి కొత్త దారిపట్టాయి. చానళ్ళు, వెబ్ సైట్ల యుగంలో కూడా ఆయనదే ముందడుగు. జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన ఒక మార్గదర్శి. అభిమాని. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. చిన్నపత్రికైనా.. పెద్ద పత్రికైనా.. ఆయనకు ఒకటే. దేనికైనా రాస్తారు ఆయన… కాలాన్ని, కలాన్ని నమ్ముకున్న ఒక కాలమిస్టు. ఆపర్చునిస్టు మాత్రం కాదు. ఇప్పుడు 85వ ఏట కూడా ఆయన ఒక ప్రయోగశాలనే.

తెలుగు భాషకు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఏ.బి.కె. చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు.

ఎ.బి.కె జర్నలిస్టు మాత్రమే కాదు. సాహిత్య వేత్త, తత్వచింతకుడు, పీడిత జనపక్ష పాతి, ఉద్యమశీలి. మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖలతోనూ ఆయనకు పరిచయం ఉందని గుంటూరి శేషేంద్ర శర్మ 1996లో అన్నారు.  సంపాదకుని పని అశిధారావ్రతం. ఎ.బి.కె సంపాదకీయాలలో బిందువుల్లో సింధువును, అద్దంలో కొండను చూపాడని డాక్టర్ తిరుమల రామచంద్ర అభివర్ణించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవడం ఎ.బి.కె విలక్షణత. వస్తువు, రూపం కలిపిన మేలిమి కలయికలు, విజ్ఞాన పేటికలు ఆయన సంపాదకీయాలు, అని సి నారాయణ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశాడాయన.. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య లాంటి ప్రముఖుల చర్చలను ప్రత్యక్షంగా చూశారు. తనను వాళ్లు చాలా ప్రభావితం చేశారంటారు.

 నాకలాన్ని సానపట్టింది, ధైర్యం నూరిపోసింది ఆయనే.. నేను ఇప్పటికీ ఆయన అభిమానినే.. ఉదయంలో రెండేళ్ళు.. నేరుగా ఆయన సారథ్యంలో, తరువాత ఓ రెండేళ్ళు మాత్రమే ఆంధ్రజ్యోతిలో ఆయనతో కలసి పనిచేశాను. కానీ, మా మధ్య కలం బంధం 35 సంవత్సరాలు. ఎప్పుడు, ఎక్కడ కనిపించినా.. “ఏరా బాబూ.. రాధా.. బాగున్నావా, ఏమైనా రాస్తున్నావా” అని ఆప్యాయంగా అడుగుతారు.   ఆయన అందరినీ తేలికగా నమ్ముతాడు. వలలో చిక్కుకుపోతాడు. దాంతో ఆయనను నమ్ముకున్నోళ్ళు అలాగే మిగిలి పోతారు. ఆ తరువాత ఆయన జరిగిన పొరపాటు తెలుసుకుంటారు.. ఇంతలో పుణ్యకాలం అయిపోతుంది.. మళ్ళీ కథ మొదలు.. ఇతి ఒక వృత్తం….

జర్నలిస్టులందరూ ఆయన కుటుంబ సభ్యులే.  అందరూ ఉన్నా ఆయన ఒంటరి. ఆయన అర్ధాంగి అన్నింటినీ అధిగమించి ఆయనతో కలసి సుదీర్ఘ ప్రయాణం చేసి డస్సి పోయి అనంత ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అయినా ఆయన ఆలోచన, కలం నిర్విరామంగా అడుగులు వేస్తునే ఉన్నాయి. హైదారాబాద్, కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ నిర్వహణలోని వృద్ధాశ్రమంలో కాలం వెళ్ళబుచ్చుతూ కలం కవాతు చేస్తున్నారు.. ఆయన అక్షర సంపదకు శతకోటి వందనాలు. తెలుగు జర్నలిజాన్ని అనంత దూరం తీసుకెళ్ళగలిగిన సమర్ధుడాయన. మరిన్ని సంవత్సరాలు పోరాట యోధుడుడుగా నిలిచి సైన్యాన్ని నడపాలి. శత వర్షాల పాటు ఆయన కలంలో సిరా  ప్రవహించాలి సమాజంకోసం!

– నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply