ఆప్, కాంగ్రెస్ తో యశ్వంత్ 

Share Icons:
కొత్తఢిల్లీ, జనవరి 8,
లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు గాను తలో మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ పోటీ చేస్తాయి. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హాకు వదిలిపెట్టనున్నారు. సిన్హా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు విషయమై కాంగ్రెస్, ఆప్ మూడు నెలలుగా చర్చలు సాగిస్తున్నాయని, అయితే కాంగ్రెస్ కేవలం 3 సీట్లలో పోటీకే పరిమితం కావడం అజయ్ మాకెన్‌‌కు నచ్చకపోవడం వల్లే ఆయన రాజీనామా చేశారని ఆ వర్గాలు తెలిపాయి.
కాగా, తాజాగా రెండు పార్టీల మధ్య కుదిరనట్టు చెబుతున్న అవగాహన ప్రకారం, దక్షిణ, తూర్పు, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుంది. దిలీప్ పాండే, అతిషి మార్లెన, రాఘవ్ ఛదా ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తారు. పశ్చిమ, వాయవ్య ఢిల్లీ, ఛాందినీ చౌక్‌లలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెడుతుంది. మరోవైపు, కాంగ్రెస్, ఆప్ పొత్తుపై వ్యాఖ్యానించేందుకు కాంగ్రెస్ నేతలు నిరాకరిస్తున్నారు. అయితే ఏ పార్టీతోనూ పొత్తుకు క్షేత్రస్థాయి కార్యకర్తలు సుముఖంగా లేరని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఆప్ సైతం పొత్తుల వ్యవహారంపై ఇంకా పెదవి విప్పడం లేదు.
మామాట: ఇంకా ఇటువంటి వింతలు ఎన్ని చూడాలో.. 

Leave a Reply