ఉలిక్కిప‌డుతున్న ప్ర‌భుత్వం!

Share Icons:

ఉలిక్కిప‌డుతున్న ప్ర‌భుత్వం!

ఎవ‌రైనా ఏదైనా మంచి ప‌ని చేస్తే వారిని మ‌నం అభినందిస్తాం. ఆ ప‌ని ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డితే మ‌రింత‌గా ఆనందిస్తాం. అయితే కేంద్ర ప్ర‌భుత్వం, సంబంధిత సంస్థ‌లు అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్న‌ది.

ఈ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఏమౌతుందా అని ఆందోళ‌న క‌లుగుతున్న‌ది. ఆధార్ సంస్థ స‌మాచార గోప్య‌త‌లోని లోపాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన ది ట్రిబ్యూన్ ఆంగ్ల ప‌త్రిక విలేక‌రి ర‌చ‌నా ఖ‌యారా పై కేసు పెట్ట‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

ట్రిబ్యూన్ అనేది ఎంతో బాధ్య‌తాయుత‌మైన ప‌త్రిక‌. అల్ల‌రి చిల్ల‌ర క‌థ‌నాలు రాసే త‌క్కువ స్థాయి ప‌త్రిక కాదు. అలాంటి ఒక దిన‌ప‌త్రిక ఒక అంశాన్ని వెలికి తీసుకువ‌స్తే అందుకు ఎంతో సంతోష‌ప‌డాలి.

అందులో చూపించిన అంశాల‌ను స‌రిదిద్దుకుని మంచి పాల‌న అందించాలి. అలా కాకుండా కేంద్ర‌ప్ర‌భుత్వం, ఆధార్ సంస్థ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

త‌మ‌కు సంబంధించి త‌మ విలేక‌రి ఇచ్చిన స‌మాచారం మొత్తాన్ని ఎంతో బాధ్య‌త‌తో తాము ప్ర‌చురించామ‌ని ది ట్రిబ్యూన్ సంస్థ వెల్ల‌డించినా కూడా ఆధార్ సంస్థ అధికారులు విన‌లేదు.

ఆధార్ డేటా సుర‌క్షితం కాద‌ని ర‌చ‌న ఎంతో చాక‌చ‌క్యంగా నిరూపించారు. ఆధార్ కార్డు కోసం మ‌నం ఇచ్చే స‌మాచారం ఎంతో సుర‌క్షితంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క పౌరుడూ కోరుకుంటారు.

ఆధార్ స‌మాచారాన్ని గోప్యంగా ఉంచుతామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో కాలంగా ఎన్నో సంద‌ర్భాల‌లో చెప్పింది. అంతే కాదు, సుప్రీంకోర్టులో కూడా త‌న వాద‌న‌గా విన్న వించుకుంది.

మ‌రి అలాంట‌ప్పుడు అందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

లాజిక్ మ‌ర‌చిన ప్ర‌భుత్వం

అలా కాకుండా ఆధార్ స‌మాచారం అతి తేలిక‌గా దొరికే వ‌స్తువుగా మారిన‌పుడు దాన్ని ప్ర‌శ్నించే అధికారం ఈ దేశ పౌరులంద‌రికి ఉంటుంది.

ఈ లాజిక్‌ను మ‌ర‌చిపోయిన ప్ర‌భుత్వం త‌న అస‌మ‌ర్ధ‌త‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి విలేక‌రుల‌పైనా, ప‌త్రిక‌ల పైనా కేసులు బనాయించ‌డం మంచి ప‌ని కాదు.

ఈ కేసును త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఇండియ‌న్ న్యూస్ పేప‌ర్ సొసైటీ కూడా డిమాండ్ చేసింది.

కీల‌క స‌మాచారం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న‌దో ఆమె ఎంతో చాక‌చ‌క్యంగా నిరూపించారు. అందుకే ఆమె అరెస్టును బాధ్య‌త‌గ‌ల సంస్థ‌ల‌న్నీ ముక్త‌కంఠంతో ఖండిస్తున్నాయి.

ఈ ప‌రిణామం క‌చ్చితంగా ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడిగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంది. ప్ర‌సార మాధ్య‌మాల‌పై ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఇది అద్దం ప‌డుతున్న‌ది.

ప్ర‌జాప్ర‌యోజ‌నాల దృష్ట్యా ప్ర‌చురించిన ఈ క‌థ‌నాన్ని గౌర‌వించ‌డం ప్ర‌భుత్వం నేర్చుకోవాలి. ఆధార్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల‌ను స‌రిదిద్దాలి. త‌క్ష‌ణ‌మే ఆ విలేక‌రిపైన కేసును ఉప‌సంహ‌రించుకోవాలి.

Leave a Reply