మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా అరెస్ట్…మంత్రులని కూడా అరెస్ట్ చేయాలంటున్న టీడీపీ

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: ఇటీవల మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలు, చంద్రబాబు లక్ష్యంగా అసభ్యకరమైన రీతిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే మంత్రి మాటలకు ధీటుగా కృష్ణా జిల్లాకు చెందిన పద్మజ అనే మహిళపై తీవ్ర వ్యాఖ్యలతో దూషించింది. దీంతో ఆమెని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ… ‘చంద్రబాబు గారిపై చెప్పులతో, రాళ్లతో జగన్ గారు దాడి చేయిస్తే పోలీసులకు అది భావ ప్రకటన స్వేఛ్ఛగా కనిపించింది. జగన్ గారి చెత్త పాలన చూసి కడుపు మండి ఒక మహిళ మాట్లాడితే పోలీసులకు అది చట్ట వ్యతిరేక చర్యగా కనిపించడం ఆశ్చర్యంగా ఉంది. పద్మజగారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో వైకాపా మంత్రులు, నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? అని నారా లోకేశ్ నిలదీశారు. మంత్రులు బూతులు తిట్టినా, నీ అమ్మ మొగుడు అంటూ దుర్భాషలాడినా అది పవిత్రమైన భావ ప్రకటనా స్వేచ్ఛలా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. ‘ఎప్పటికీ మీరే అధికారంలో ఉండిపోతారు అనుకోవడం అవివేకం జగన్ గారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మీరు చేస్తున్న ప్రతి చర్య భవిష్యత్తులో మీ మెడకు చుట్టుకోవడం ఖాయం’ అని ట్వీట్లు  చేశారు.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ‘నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది మహిళలు జగన్ గారిని తిట్టుకుంటున్న మాట వాస్తవం. 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్న జగన్ గారు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. అందులో భాగంగా కడుపు మండిన ఒక మహిళ మీ మంత్రులు మాట్లాడే మాటలు తట్టుకోలేక విమర్శలు చేస్తే అరెస్టులు చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు

పద్మజ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని బుద్ధా వెంకన్న అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైకాపా మంత్రులు, నాయకులను కూడా అరెస్టులు చేస్తారా? అని ఆయన నిలదీశారు. కాగా, ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ అధినేత చంద్రబాబునాయుడుపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply